గరంగరం.. వరంగల్ బల్దియా సమావేశం.. రూ.135 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం

గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం గరం గరంగా సాగింది. ప్రజా ప్రతినిధుల ఆగ్రహంతో సమావేశం వాడి వేడిగా ముగిసింది. ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో మేయర్, కమిషనర్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించని సమావేశాలు ఎందుకు అంటూ నిలదీశారు

విధాత, ప్రత్యేక ప్రతినిధి :

గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం గరం గరంగా సాగింది. ప్రజా ప్రతినిధుల ఆగ్రహంతో సమావేశం వాడి వేడిగా ముగిసింది. ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో మేయర్, కమిషనర్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించని సమావేశాలు ఎందుకు అంటూ నిలదీశారు. బందోబస్తు పేరుతో పోలీసులు కార్పొరేటర్లను తనిఖీ చేయడమేంటంటూ ప్రశ్నించారు. తదుపరి
రూ.135 కోట్ల అభివృద్ధి పనులకు వరంగల్ బల్దియా కౌన్సిల్ ఆమోదం తెలియజేసింది. ఈ సందర్భంగా కౌన్సిల్లో ప్రవేశపెట్టిన 39 ఎజెండా అంశాల పై చర్చించి ఆమోదం తెలిపారు. ఈ మేరకు సోమవారం బల్దియా మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్, వివిధ పార్టీల కార్పొరేటర్లు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య , ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 కమిషనర్, మేయర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ

మేయర్ తో పాటు, కమీషనర్, కార్పోరేషన్ అధికారులపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ఏ ఒక్క అధికారి స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నారు. కౌన్సిల్ కు వచ్చే నేతలను బందిపోటు దొంగల్లా పోలీసులు తనిఖీలు చేస్తున్నారని మండిపడ్డారు. బందోబస్త్ తనిఖీల పేరుతో పోలీసుల అత్యుత్సాహం మంచిది కాదన్నారు. అభివృద్ధిపై స్పందించని కౌన్సిల్ సమావేశం ఎందుకంటూ నిలదీశారు.

 పదేళ్లు నిలిచిపోయిన అభివృద్ధి – ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

గత పదేళ్లులో గ్రేటర్ పరిధిలో అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. రెండేళ్లలో అనుకున్న దానికి మించి అభివృద్ధి చేశామన్నారు. గత ప్రభుత్వంలో నాయకులు కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులను కుడా సరిగ్గా వినియోగించుకోలేదన్నారు. నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా కమీషన్ల కోసం గత ప్రభుత్వంలో నాయకులు పని చేశారని విమర్శించారు.

39 అభివృద్ధి అంశాలకు ఆమోదం

ఇటీవల వచ్చిన వరద వల్ల దెబ్బతిన్న ప్రతి డివిజన్ కు అత్యవసర పనుల నిమిత్తం రూ.5 లక్షల కేటాయించారు. ప్రతి డివిజన్ కు 5 హైమాస్ట్ లైట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అమృత్ 2.0 లో భాగం గా వచ్చే 20 సం.లకు సరిపడే అవసరాలకు అనుగుణం.గా త్రాగు నీటి సరఫరా పనులు చేపట్టాలని తీర్మానం చేశారు. నగర అభివృద్ధి పథకం కింద రూ. 50 కోట్లతో బహుళార్థకంగా ఉపయోగపడే పనులు చేయాలని, 66 డివిజన్ లలో 198 మంది వాలంటీర్ల ద్వారా తడి పొడి చెత్త పై అవగాహన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వచ్చిన వరదల్లో విస్తృత సేవలు అందించిన పారిశుద్ధ్య సిబ్బంది, డ్రైవర్లకు ప్రోత్సాహకంగా వెయ్యి రూపాయల అందజేయాలని, ఘన వ్యర్థాల నిర్వహణకు బయో మిథనైజేషన్ ప్లాంట్ 100 టి పి డి (టన్స్ ఫర్ డే) సామర్థ్యంతో ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు.

 

Latest News