- వరంగల్‌లో కుండపోత వర్షం
- జలదిగ్బంధంలో పలు కాలనీలు
- కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం
- పట్టించుకోని ప్రజా ప్రతినిధులు
విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్‌లో ఆదివారం కురిసిన కుండపోత వర్షంతో నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో స్థానికంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జి, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు శివనగర్, కరీమాబాద్ ఎస్ ఆర్ ఆర్ తోట, కాశికుంట తదితర పలు కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. మోకాలు లోతు వర్షంతో ఇండ్లన్నీ జలదిగ్బంధానికి గురయ్యాయి. రెండు గంటల పాటు ఏకధాటిన కురిసిన వర్షంతో వర్షం నీరు, మురుగనీరు సాఫీగా వెళ్లలేక డ్రైనేజీలు, ప్రధాన నాలాలు పొంగిపొర్లి రోడ్డుపైకి, ఇళ్ల చుట్టూ నీరు నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే వర్షం తగ్గుముఖం పట్టడంతో మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు అక్కడక్కడ సహాయ చర్యలు ప్రారంభించారు. మరోసారి వర్షం కురిస్తే నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.
ఈ భారీ వర్షానికి వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద వరద నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారిపై ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద నిలువెత్తు నిలిచిన వరద నీటిలో రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. అందులోని ప్రయాణికులను స్థానిక పోలీసులు తాడు సహాయంతో సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
– ముందు చూపులేని మున్సిపల్ కార్పొరేషన్
ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా వరుసగా నగరంలోని శివనగర్, కరీమాబాద్ తదితర పలు ప్రాంతాలు మునుగుతున్నప్పటికీ డ్రైనేజీల నిర్మాణంలో కానీ, నీటి నిల్వ ప్రాంతాల నుంచి సాఫీగా నీరు వెళ్లేందుకు చర్యలు చేపట్టడంలో మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక కార్పొరేటర్లు, మేయర్ పట్టించుకోకపోవడం ఫలితంగా నగరంలోని పలు కాలనీలు తరచూ జలదిగ్బంధానికి గురయ్యే దుస్థితి ఏర్పడుతుందని విమర్శిస్తున్నారు. కంటి తుడుపు చర్యలు కాకుండా, ఇప్పటికైనా సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.