Heatwaves | తెలంగాణలో రెండురోజులు వడగాలులు.. కీలక సూచనలు చేసిన వైద్యారోగ్యశాఖ

  • Publish Date - April 6, 2024 / 09:05 AM IST

Heatwaves | తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దాంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఎండకు తోడు వడగాలులు వీస్తుండడంతో ఉక్కపోత, చెమటతో అల్లాడుతున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు చేసింది. శుక్ర, శనివారాల్లో వడగాలులు వీస్తే అవకాశం ఉందని.. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండుమూడు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు ఉదయం 11 నుంచి 4.30 గంటలకు బయటకు రావొద్దని సూచించింది. వడగాల్పుల తీవ్రత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని వాతావరణ విభాగం తెలిపింది. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇక ఈ నెల 7 తర్వాత ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. గత వారం రోజులుగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఏప్రిల్‌ తొలినాళ్లలోనే ఎండలు ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉంటాయోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2016 తర్వాత ఈ ఏడాది అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగానే ఉంటున్నాయని తెలిపారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ సైతం స్పందించింది. ఎండలు, వడగాలుల నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరడంతో వాతావరణశాఖ వడగాలుల అలెర్ట్‌ జారీ చేసిందని ప్రజారోగ్య సంచాలకులు రవీందర్‌నాయక్‌ తెలిపారు.

వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని.. అదే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంట్లోనే ఉన్నా దాహం వేయకపోయినా వీలైనంత వరకు తగినంత నీరు తాగుతూ ఉండాలి.. ఓఆర్‌ఎస్‌ తాగాలని.. నిమ్మరసం, లస్సీ, మజ్జిగతో పాటు పండ్ల రసాలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణ సమయంలో వెంట నీటిని తీసుకెళ్లాలని.. పుచ్చకాయ, మస్క్‌ మెలోన్, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ, పాలకూర, ఇతర స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు వంటి అధిక నీటి కంటెంట్‌ ఉన్న సీజనల్‌ పండ్లు, కూరగాయలు తినాలని చెప్పింది. ఎండలో వెళ్లేప్పుడు గొడుగు, టోపీ, టవల్‌ వంటి వాటిని ధరించాలని.. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు, చప్పల్స్‌ వేసుకోవాలని సూచించింది. ఇంట్లో బాగా వెంటిలేషన్, చల్లని ప్రదేశాలలో ఉండాలని.. పగటిపూట కిటికీలు, కర్టెన్లు మూసి ఉంచాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. శిశువులు, చిన్న పిల్లలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, గర్భిణులు, మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటుతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Latest News