బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అనుబంధంగా ఉపరితల ద్రోణి ప్రభావంతంలో రెండు తెలుగురాష్ట్రాల్లో బుధవారం మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్ లో ఎలినినో ప్రభావంతో నెలకొన్న వర్షభావం పరిస్థితుల మధ్య తాజాగా కురుస్తున్న వర్షాలు రైతాంగానికి భారీ ఊరటనిస్తున్నాయి.
తెలంగాణలో బుధవారం కూడా వర్షాల ప్రభావం కొనసాగింది. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో రోజంతా ముసురు వాతావరణం నెలకొనగా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మేఘావృత పరిస్థితులు కొనసాగనున్నాయి. రాబోయే కొన్ని గంటలలో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, పెద్దపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్‌లో తేలికపాటి జల్లులు, చిరుజల్లులు కొనసాగే అవకాశముందని చెప్పారు.
బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో విస్తృతంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. ఉదయం వేళల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
మధ్య, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో విస్తృతంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ తెలంగాణలో సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ స్వల్ప జల్లులు కురిసే అవకాశం ఉందని వెదర్‌మ్యాన్ బాలాజీ వెల్లడించారు.
