Rain Alert | హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం వాన దంచికొట్టింది. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి వంటి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలోని కల్లూరులో అత్యధికంగా 111.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. కొత్తగూడెంలో 91, మహబూబాబాద్‌లో 58.5, ములుగులో 57.8, సంగారెడ్డిలో 54.8, వరంగల్‌లో 43, రంగారెడ్డిలో 37.8, ఆసిపాబాద్‌లో 25.3 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ ప్రకటించింది.
రాబోయే నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు..
రాబోయే నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం మధ్య ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి విదర్భ వరకూ 900 మీటర్ల ఎత్తున మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో గురువారం నుంచి మూడ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.