Heavy Rains | హైదరాబాద్ : తెలంగాణ( Telangana ) వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి వర్షాలు( Rains ) తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విత్తనాలు మొలకెత్తక రైతులు( Farmers ) తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ( Weather Department ) అన్నదాతలకు చల్లని కబురు అందించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పొలాల వద్దకు వెళ్లే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
గురువారం నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. శుక్రవారం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
ఇక హైదరాబాద్ నగరంలో గత నాలుగైదు రోజుల నుంచి ఎండకాలంను తలపిస్తోంది. రాత్రి వేళ తీవ్రమైన ఉక్కపోత ఉంది. పగటి పూట కూడా అదే పరిస్థితి. 33 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ ఉష్ణోగ్రతల నమోదు నేపథ్యంలో ఇది వానాకాలమా..? ఎండకాలమా..? అన్న పరిస్థితి నెలకొంది. మరి నేడు, రేపు నగరంలో కూడా వర్షాలు కురిస్తే ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉంది.