Hyderabad Book Fair | హైదరాబాద్ : పుస్తక ప్రియులకు శుభవార్త. ప్రతి ఏడాది మాదిరి.. ఈ ఏడాది కూడా హైదరాబాద్ నగరం బుక్ ఫెయిర్‌కు సిద్ధమైంది. 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్( Hyderabad Book Fair )ను డిసెంబర్ 19 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ సోమవారం ప్రకటించింది. ఈ పుస్తక ప్రదర్శనకు సంబంధించిన గోడ పత్రికను బుక్ ఫెయిర్ సలహాదారులు ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ సంపాదకుడు కే రామచంద్రమూర్తి ఆవిష్కరించారు. ఇక ఈ పుస్తక ప్రదర్శనకు ఇందిరా పార్కు సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియం వేదిక కానుంది.
గతంలోని తప్పిదాలు, లోపాలను సరిదిద్దుకుని అందంగా, విజ్ఞానదాయకంగా బుక్ ఫెయిర్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రదర్శనలో పుస్తక ఆవిష్కరణలు, సాహితీ చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని బుక్ ఫెయిర్ కమిటీ అధ్యక్షులు యాకూబ్ షేక్, కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
బుక్ ఫెయిర్‌లో స్టాళ్ల ఏర్పాటు కోసం నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. దరఖాస్తులను అన్ని పని దినాల్లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు.
