Day time Drunken Drive | హైదరాబాద్ నగర రహదారులపై పసి ప్రాణాలతో ‘జూదం’ ఆడుతున్న డ్రైవర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత రెండు వారాల్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో మద్యం మత్తులో స్కూల్ వాహనాలు నడుపుతున్న 35 మంది డ్రైవర్లు పట్టుబడటమే కాక, వీరిలో చాలామంది రక్తంలో అత్యధిక ఆల్కహాల్ స్థాయితో పట్టు బడ్డారు. కొన్ని కేసుల్లో Blood Alcohol Content (BAC) స్థాయి 200 mg/ml నుంచి 400 mg/ml మధ్యగా ఉండగా, ప్రభుత్వం అనుమతించే పరిమితి 30 mg/ml మాత్రమే.
ఈ కేసులు గత నెలలో నమోదైన మరో ఘటనకు కొనసాగింపుగా వెలుగుచూశాయి. అప్పట్లో 13 మంది స్కూల్ డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. తరచుగా జరుగుతున్న ఈ ఉదంతాలు, విద్యార్థుల రక్షణపై పట్టించుకోని పాఠశాల యాజమాన్యాల అలసత్వాన్ని ఎత్తిచూపుతున్నాయి.
పూర్తి నగర వ్యాప్తంగా 28 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో, ప్రధాన కూడళ్ళ వద్ద — ఉదాహరణకు HPS ఔట్‌గేట్, పరేడ్ గ్రౌండ్, CTO పాయింట్ వంటి ప్రాంతాల్లో — రోజూ కనీసం రెండు సార్లు 15-20 వాహనాల చొప్పున తనిఖీలు జరుగుతున్నాయి. డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్టు జరుపగా వారిలో అనేకమంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారని ట్రాఫిక్ పోలీస్ అధికారి పి. చంద్రశేఖర్ తెలిపారు. తాజా డ్రైవ్‌లో పట్టుబడిన వారిలో 12 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, 19 మంది ఆటో డ్రైవర్లు, 4 మంది వ్యాన్ డ్రైవర్లు ఉన్నారు. వీరందరిపై మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేయడంతోపాటు, జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నగరంలో 10,000కి పైగా స్కూల్ వాహనాలు విద్యార్థులను రవాణా చేస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్య ప్రమాదకరంగా మారుతోంది. విషయం ఇంతటితో ఆగలేదు. మరో 100 డ్రైవర్లను కూడా పోలీసు శాఖ పట్టుకుంది. వీరిలో 85 మంది ఆటోలు, 15 మంది ప్రైవేట్ వ్యాన్లు — వీరంతా అనుమతికి మించిన విద్యార్థులను తాము నడిపే వాహనాల్లో కూర్చోబెట్టడం వల్ల పట్టు బడ్డారు. ఇది కూడా రహదారి ప్రమాదాలకు కారణమయ్యే ప్రాథమిక అంశమని ట్రాఫిక్ DCP రాహుల్ హెగ్డే పేర్కొన్నారు.
ఇవన్నీ కేవలం రాత్రిపూటనే కాదు, రోజుఫూట కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ శాఖ డే టైమ్ డ్రంక్ డ్రైవింగ్ చెక్స్ ప్రారంభించింది. 2025 జూలై 16న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలి రోజే 25 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడడం తల్లిదండ్రుల ఆందోళనకు కారణమైంది. ఈ డ్రైవ్‌ను మింట్ కాంపౌండ్ వద్ద ప్రారంభించిన ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్, ఇది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచనలతో తీసుకున్న వ్యూహాత్మక చర్య అని స్పష్టంగా తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు రాత్రి సమయంలో మాత్రమే జరిగుతాయని భావించే మందుబాబులను అడ్డుకోవడానికి పగటిపూట కూడా మద్యం మత్తులో డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసేందుకు ప్రారంభమైన 24×7 ప్రయత్నం. పట్టుబడిన డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, వారి డ్రైవింగ్ లైసెన్స్‌లు తాత్కాలికంగా రద్దు చేయడం లేదా పర్మనెంట్‌గా రద్దు చేసే అవకాశముందని పోలీసులు తెలిపారు. కఠినమైన శిక్షలతోపాటు — అవసరమైతే జైలు శిక్షలు కూడా ఉండొచ్చని చెప్పారు. ఈ పరిస్థితుల్లో, ట్రాఫిక్ పోలీసులు పాఠశాల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలలు తమ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలని సూచనలు ఇచ్చినప్పటికీ, వాటిని పట్టించుకోకపోవడం వల్ల విద్యా శాఖను అప్రమత్తం చేయాలని భావిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన డ్రైవింగ్ చర్యలను ఉపేక్షించే పాఠశాలలపై NOC రద్దుకు కూడా సిఫారసు చేయనున్నట్టు జోయెల్ డేవిస్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసు విభాగం ప్రజల సహకారం కోరుతోంది. రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరు మద్యం సేవించిన తర్వాత వాహనం నడపరాదని, పోలీసుల తనిఖీల్లో సహకరించాలని కోరారు. మీడియా ద్వారా ఎక్కువ అవగాహన కల్పించేందుకు కూడా అధికారులు పిలుపునిచ్చారు. తద్వారా ఈ చర్యలు దేశంలోని ఇతర నగరాలకు కూడా ఆదర్శంగా నిలవాలని, విద్యార్థుల భద్రతకు కొత్త ప్రామాణికాలు ఏర్పడాలని పోలీస్ శాఖ ఆశిస్తోంది.
Categories : Hyderabad News