Hyderabad Metro । హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుకు మార్గం సుగమం అయింది. నగరం విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ రద్దీ పెరగటంతో ఇప్పుడున్న మెట్రోను ఇతర మార్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన డీపీఆర్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.24269 కోట్ల అంచనాలతో చేపట్టే మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే పనులు మొదలు పెట్టి వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశలో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు విజయవంతంగా సేవలందిస్తున్నది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రూ.22,000 కోట్ల తో నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రోజుకు దాదాపు 5 లక్షల మంది హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారు. రెండవ దశ అందుబాటులోకి వస్తే రోజుకు మరో 8 లక్షల మంది మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉన్నది. మెట్రో రైల్ మొదటి దశ అమలైనప్పుడు హైదరాబాద్ దేశంలోనే ఢిల్లీ తర్వాత 2వ స్థానంలో నిలిచింది. గత ఏడేండ్లుగా మెట్రో విస్తరణ అటకెక్కింది. ఈ సమయంలో మిగిలిన నగరాలు మెట్రో రెండవ, మూడవ దశ నిర్మాణాలను కూడా పూర్తి చేసుకున్నాయి. దీనితో.. ఒకప్పుడు దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన హైదరాబాద్ మెట్రో.. ఇప్పుడు 9వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి పెద్ద నగరాలతో పాటు, పుణె, నాగపూర్, అహ్మదాబాద్ వంటి చిన్న సిటీలు కూడా మెట్రో విస్తరణలో హైదరాబాద్ నగరం కంటే ముందుకు వెళ్లాయి.
ఏడేండ్లు ఆలస్యం చేయటంతో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా భారీగా పెరిగి పోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచే కొత్త ప్రభుత్వం మెట్రో విస్తరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న మార్గాలతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధిని గమనంలో ఉంచుకుని మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా రెండో దశలో 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేరకు మెట్రోను విస్తరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి సంబందించిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) పూర్తయింది.
ప్రస్తుతం మూడు కారిడార్లు ఉండగా.. రెండో దశలో కొత్తగా ఐదు కారిడార్లను.. నాలుగో కారిడార్ నాగోల్– శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు (36.8 కి.మీ), 5వ కారిడార్ రాయదుర్గ్–కోకాపేట్ నియోపొలిస్ వరకు (11.6 కి.మీ), 6వ కారిడార్ ఎంజీబీఎస్–చంద్రాయణ గుట్ట వరకు (7.5 కి.మీ), 7వ కారిడార్ మియాపూర్–పటాన్చెరు వరకు (13.4 కి.మీ), 8వ కారిడార్ ఎల్ బీ నగర్–హయత్ నగర్ వరకు (7.1 కి.మీ.) నిర్మిస్తారు. మెట్రో రెండవ దశను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోపాటు పీపీపీ విధానంలో చేపడుతారు. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.24.269 కోట్లు. అందులో 30 % అంటే రూ.7313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తుంది. 18 శాతం అంటే రూ.4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తుంది. మిగిలిన 52 శాతం నిధులను రుణాలతో పాటు పీపీపీ విధానంలో సమకూర్చుతారు.