HYDRA | బఫర్ జోన్‌లో ఆక్రమణలకు భయపడేలా చేస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ నగరంలో బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటేనే భయపడే స్థితికి తీసుకొస్తామని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఐపీఎస్‌ రంగనాథ్ స్పష్టం చేశారు.

  • Publish Date - August 12, 2024 / 03:59 PM IST

ఎమ్మెల్యేల కామెంట్స్‌పై ప్రతిస్పందన అనవసరం
హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్‌

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటేనే భయపడే స్థితికి తీసుకొస్తామని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఐపీఎస్‌ రంగనాథ్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నగరంలో ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఫిర్యాదులపై మా వంతు ఎంత చేయాలో అంత చేస్తామన్నారు. దశలవారీగా హైడ్రా పనిచేస్తుందని చెప్పారు. మొదటి దశలో ఆక్రమణలను అడ్డుకుంటామన్నారు. రెండో దశలో ఆక్రమించి నిర్మించిన భవనాలపై చర్యలు, అనుమతుల నిరాకరణ ఉంటుందని తెలిపారు. మూడో దశలో చెరువుల పూడిక తీసి వాన నీటిని మళ్లించి పునరుజ్జీవం కల్పిస్తామన్నారు. హైదరాబాద్ లో చెరువుల కబ్జా ప్రధాన సమస్యగా మారిందన్నారు.

చెరువులు నాళాలు కబ్జా కాకుండా చూసుకోవడమే హైడ్రా లక్ష్యమన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడం, కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయడం హైడ్రా ముఖ్య ఉద్దేశమన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు కలిపి 400కు పైగా ఉన్నాయన్నారు. ఎన్నారెస్సీ నివేదిక ప్రకారం 44 ఏళ్లలో చాలా చెరువులు కనుమరుగయ్యాయని చెప్పారు. అధిక శాతం చెరువులు 60 శాతం, కొన్ని చెరువులు 80 శాతం ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. చెరువుల పరిధిలోని ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.

గొలుసుకట్టు చెరువులన్నీ పునరుద్ధరిస్తామని, చెరువులకు నీటిని మళ్లించే నాలాలు పూడుకుపోయాయని, అక్రమణలతో గొలుసుకట్టు చెరువులన్నీ మాయమయ్యాయన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్‌లలో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దన్నారు. చెరువుల పరిరక్షణకు అందరితో కలిసి మేదోమథనం చేస్తామని, పార్కు స్థలాలు పరిరక్షించే కాలనీ సంఘాలను సమర్థిస్తామని, నందగిరి హిల్స్ సొసైటీతో మాకు ఎలాంటి ఒప్పందం లేదని, చందానగర్ లో గతేడాది బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులిచ్చారని తెలిపారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమంగా అనుమతులు ఇచ్చే అధికారులపై విజిలెన్స్ విచారణ చేసి ప్రభుత్వానికి వివరిస్తామన్నారు.

హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు

త్వరలో హైడ్రాకు ప్రభుత్వం పెద్దఎత్తున సిబ్బందిని సమకూరుస్తుందని, త్వరలోనే ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటవుతుందని రంగనాథ్ తెలిపారు. 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి ఉందన్నారు. హైడ్రాకు సుమారుగా 3500 మంది స్టాఫ్ అవసరం ఉందన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కు ఎక్కువ మంది స్టాఫ్ అవసరం ఉందని, హైడ్రాలో వివిధ జోన్లు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని, ప్రభుత్వం కుండా హైడ్రాకు చాలా సపోర్ట్ చేస్తుందని, ఇప్పటికే 200 కోట్లు నిధులు కూడా కేటాయించిందని తెలిపారు. పార్క్ స్థలాలు, బఫర్ జోన్, ఎస్టీఎల్ స్థలాలకు ఎల్‌ఆరెస్‌, బీఆరెస్ రేగ్యులైజేషన్‌ జరగదన్నారు. ఎవరైనా బఫర్ జోన్ లో నిర్మాణాలు చేస్తే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు బఫర్ జోన్ లో నిర్మించిన వాటికి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు ఉంటాయన్నారు. ప్రతి రోజూ హైడ్రాకు 100 కు పైగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. హైడ్రా పై కామెంట్ చేసిన ఎమ్మెల్యేల కామెంట్స్ పై నేను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. లే ఔట్ల పేరుతో చెరువులు కబ్జా చేసిన వారిలో ఎక్కువగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే ఉన్నారని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో హైడ్రా కార్యాచరణ మొదలయ్యాక మెరుగైన ఫలితాలు చూస్తారని తెలిపారు.