నీవు మొగోడివి అయితే…! ఆ ఆరుగురి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా…..!! కేటీఆర్ సవాల్‌

: బీఆరెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీవు మొగోడివి అయితే.. ఆ ఆరుగురు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు రా

  • Publish Date - July 1, 2024 / 05:29 PM IST

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీవు మొగోడివి అయితే.. ఆ ఆరుగురు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు రా… ఓట్లతోని కొట్టి ఆ ఆరుగురిని శాశ్వతంగా రాజ‌కీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటదని కేటీఆర్ నిప్పులు చెరిగారు. జ‌గిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన జిల్లా బీఆరెస్‌ పార్టీ స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. నిజంగా రోషం, ద‌మ్ముంటే బీఆరెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తమ ప‌ద‌వికి రాజీనామా చేసి మళ్లీ ప్ర‌జ‌ల్లోకి రావాలని సవాల్ చేశారు. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, ఆయారాం.. గ‌యారాం.. విష‌బీజానికి మొగ్గ తొడిగింది ఇందిరా గాంధీ అని, హ‌ర్యానాలో ఇత‌ర పార్టీల‌ ఎమ్మెల్యేల‌ను గుంజుకున్న చరిత్ర ఇందిరా గాంధీకే దక్కిందని, అలా పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డే ఎమ్మెల్యేల‌ను కుక్క‌ల మాదిరి రాళ్ల‌తో కొట్టి చంపాల‌ని రేవంత్ రెడ్డి గ‌తంలో మాట్లాడారని, మ‌రి ఇప్పుడు ఎవ‌రు పిచ్చికుక్క‌.. ఎవ‌ర్నీ రాళ్ల‌తో కొట్టిచంపాలో ప్రజలు గ్రహించాలన్నారు. ఎవ‌ర్నీ రాళ్ల‌తో కొట్టాల్సిన అవ‌స‌రం లేదు గాని… రేవంత్ రెడ్డి నీవు మొగోడివి అయితే.. నీకు ద‌మ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు రా.. ఓట్ల‌తో కొట్టి ఆ ఆరుగురిని రాజ‌కీయంగా శ్వాశ‌తంగా స‌మాధి చేసే బాధ్య‌త తెలంగాణ స‌మాజం తీసుకుంట‌ది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

నాడు రాజ్యాంగ‌బ‌ద్ధంగా విలీనం అయ్యారు

2004లో టీఆరెస్‌తో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుందని, బీఆరెస్ నుంచి 26 మంది గెలిస్తే.. నాటి కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం 10 మంది ఎమ్మెల్యేల‌ను కలుపుకునే ప్ర‌య‌త్నం చేశారని కేటీఆర్ విమర్శించారు. 2014లో కాంగ్రెస్ మెడ‌లు వంచి తెలంగాణ ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో కేసీఆర్ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించారని, 2014 త‌ర్వాత రేవంత్ రెడ్డి 50 ల‌క్ష‌ల‌తో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికి జైలుకు పోయిండని, మ‌న ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే ప్ర‌య‌త్నం రేవంత్ రెడ్డి చేశాడని ఆరోపించారు. టీడీపీ, బీఎస్పీ నుంచి మూడింట రెండొంతుల మంది గతంలో బీఆరెస్‌ పార్టీలో రాజ్యాంగ బద్ధంగా విలీనమయ్యారని రాజ్యాంగాన్ని, చ‌ట్టాన్నిమేం తుంగ‌లో తొక్క‌లేదన్నారు. 2014లో టీడీపీ నుంచి 15 మంది గెలిస్తే 10 మంది, బీఎస్పీ నుంచి గెలిచిన‌ ఇద్ద‌రు క‌లిసి బీఆరెస్‌లో విలీనం అయ్యారని, 2018లో కాంగ్రెస్ నుంచి 18 మంది గెలిస్తే.. 12 మంది బీఆరెస్‌లో విలీనమయ్యారని, రాజ్యాంగ‌బ‌ద్దంగా మూడింట రెండొంతుల మంది బీఆరెస్‌లో చేరడం జరిగిందని, ఒక్కొక్క‌రు వ‌చ్చి కండువా క‌ప్పుకోలేదని, ఆ ప‌ని కేసీఆర్ చేయ‌లేదు అని కేటీఆర్ వివ‌రించారు.

రాహుల్ గాంధీ మాటలన్ని బూటకమేనా

ఒక్క రేవంత్ రెడ్డే కాదు.. రాహుల్ గాంధీ కూడా చాలా మాట్లాడారని, ఒక పార్టీలో గెలిచి మ‌రో పార్టీలో ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్ క్వాలిఫికేష‌న్ చేస్తా అని రాహుల్ తుక్కుగూడ‌లో డైలాగ్‌లు న‌రికిండని, మ్యానిఫెస్టోలో పెట్టుడు కాకుండా పాంచ్ న్యాయ్ అనే దాంట్లో కూడా రాహుల్‌గాంధీ పెట్టారని కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సాగిస్తున్న ఫిరాయింపులతో రాహుల్‌గాంధీ మాటలన్ని బూటకమేనని అని ప్రశ్నించారు. ఒక పార్టీ నుంచి గెలిచి మ‌రో పార్టీలోకి మారొద్ద‌ని మేం మ్యానిఫెస్టోలో పెట్టామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చెప్పిండని, ఇక ఇప్పుడు జ‌గిత్యాల ప్ర‌జ‌లు నిర్ణ‌యం తీసుకోవాలని, పార్టీ మారిన నేతలు ఓట్ల‌కు వ‌స్తే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాలి అని కేటీఆర్ చెప్పారు.

గాలికి గడ్డపారలు కొట్టుకపోవు

గాలికి కొట్టుకుపోయేది గ‌డ్డిపోచ‌లు మాత్ర‌మేనని, గ‌డ్డిపార‌ల్లాంటి కార్యకర్తలు వెళ్ల‌లేదని.. ఒక గ‌డ్డిపోచ మాత్ర‌మే కొట్టుకుపోయిందని ఎమ్మెల్యే సంజ‌య్‌ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సంజయ్ కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో జ‌గిత్యాల‌కు ప‌ట్టిన శ‌ని పోయింద‌ని ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఉత్సాహంగా ఉన్న‌ట్లు అనిపిస్తోందన్నారు. నిజ‌మైన గులాబీ దండు ఎక్క‌డికి పోదని.. త‌ప్ప‌కుండా తిరిగి కేసీఆర్ నాయ‌క‌త్వంలో విజృంభిస్తామన్నారు. క‌విత‌క్క‌తో స‌హా వేల మంది క‌ష్ట‌ప‌డితే సంజయ్‌ ఎమ్మెల్యే అయిండని, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే దొంగ‌ల్లో క‌లిసిండని, రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతుల‌కు ఆశ‌ప‌డి పోయిండని, ఎమ్మెల్యే బుద్ది ఇవాళ తెలిసి వ‌చ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగిత్యాలలో కవితక్కతో సహా గల్లి గల్లి తిరుగుతాం మిమ్మల్ని గెలిపించుకుంటామన్నారు. కష్టపడి పని చేద్దామని, పార్టీ మారిన దొంగకు బుద్ధి చెబుదామన్నారు. అభివృద్ధి కోసం పోయినా అని సంజ‌య్ చెబుతున్నాడని, జ‌గిత్యాల జిల్లా ర‌ద్దు చేస్తా.. మెడిక‌ల్, న‌ర్సింగ్ కాలేజీ ర‌ద్దు చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నందుకు సంజ‌య్ కాంగ్రెస్‌లోకి వెళ్లిండా..? రాష్ట్రంలో ఎక్క‌డా లేని విధంగా 4500 డ‌బుల్ బెడ్రూం ఇండ్లు మేం ఇస్తే ర‌ద్దు చేయ‌మ‌ని పోయావా..? ఏ అభివృద్ధి ఆశించి పోయావని సంజయ్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సంజయ్ కాంగ్రెస్‌లోకి పోయింది ఒక్క‌దాని కోసం.. వియ్యంకుడి బిల్లులు రావాలి.. ఆయ‌న క్ర‌ష‌ర్ ఆగొద్ద‌ని పోయిండని, సొంత అభివృద్ధి కోసం పోయిండేగాని.. జగిత్యాల అభివృద్ధి కోసం పోలేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

తాత్కాలికంగా రెండు ఎదురుదెబ్బ‌లు త‌గిలాయని, రెండుసార్లు ఎవ‌రి పొత్తు, మ‌ద్ద‌తు అవ‌స‌రం లేకుండా 2014లో 63, 2018లో 88, 2023లో కూడా మూడో వంతు సీట్లు అంటే 39 స్థానాలు గెలిచామని, కేవలం 14 సీట్ల‌లో స్వ‌ల్ప‌ తేడాతో ఓడిపోయాం అని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ నాయ‌కులు నోటికొచ్చిన హామీలు, మాట‌లు చెప్పారని, రుణ‌మాఫీ ఇంకా జరుగలేదని, నాలుగు వేలు పెన్ష‌న్లు లేవని, ఆడ‌బిడ్డ‌లంద‌రికీ నెల‌కు రూ. 2500, క్వింటాల్‌కు రూ. 500 బోన‌స్, బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు, మెనార్టీల‌కు 20 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తాన‌ని 420 హామీలు ఇచ్చి గ‌ద్దెనెక్కిండని, కానీ ఒక్క హామీ కూడా నెర‌వేర‌లేదు అని కేటీఆర్ గుర్తు చేశారు.

ఏ కూట‌మిలో లేని పార్టీలకు నష్టం వాటిల్లింది

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు ప్రధాని మోదీ మీద‌నే ఎన్నిక‌లు జ‌రిగాయని, దీంతో స‌మాజం నిట్ట‌నిలువునా చీలిపోయిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మోదీని వ‌ద్ద‌నుకున్న‌ వారు ఇండియా కూట‌మికి, కావాల‌నుకున్న వారికి ఎన్డీఏకు ఓటేశారని, ఏ కూట‌మిలోలేని వారికి కొంత రాజకీయంగా ఇబ్బంది క‌లిగిందన్నారు. కేర‌ళ‌లో సీపీఎం ఏ కూట‌మిలో లేదని, స్వ‌తంత్రంగా మ‌న‌లాగా పోటీ చేసిందని.. 20 సీట్లలో ఒక‌టి గెలిచిందని, ఏపీలో జ‌గ‌న్ , తెలంగాణ‌లో మ‌నం అలాగే ఓడిపోయామని, ఒడిశాలో న‌వీన్ ప‌ట్నాయ‌క్ సీఎంగా ఉండి కొట్లాడితే ఒక సీటు వ‌చ్చిందని, యూపీలో బీఎస్పీకి ఒక్క సీటు కూడా రాలేదని, పంజాబ్‌లో అకాలీద‌ళ్‌కు ఒక్క సీటు కూడా రాలేదని, ఈ దేశంలో ఎన్నో బ‌ల‌మైన పార్టీలు.. బీజేడీ, అకాలీద‌ళ్, బీఎస్పీ, సీపీఎం, వైఎస్సార్‌సీపీతో పాటు మ‌న‌కు ఎదురుదెబ్బ త‌గిలింది అని కేటీఆర్ పేర్కొన్నారు.

Latest News