విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక(Jubilee Hills Byelection) పోలింగ్ రేపు మంగళవారం జరుగబోతున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాల(Cash for Votes)కు గురి చేసే ప్రయత్నాలను అడ్డుకునే క్రమంలో ఎన్నికల సంఘం తనిఖీ బృందాలు, పోలీసు బృందాలు విస్తృత తనిఖీలు కొనసాగిస్తున్నాయి. వాహనాల తనిఖీలతో పాటు అనుమానిత నాయకులు, వ్యాపార సంస్థలపై సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డలో ఓ పార్టీకి చెందిన నాయకులు డబ్బులు పంపీణీ చేస్తున్నారని సమాచారంతో హోటల్ పాలక్ పై పోలీసుల తనీఖీలు చేపటటి 11మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఓటుకు నోటులో పోటాపోటీ
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో గెలిచేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా ప్రలోభాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ పార్టీ ఓటుకు రూ.2500ఇస్తే..మరో పార్టీ 2వేలు, ఇంకోపార్టీ రూ1000 ఇస్తున్నట్లుగా నియోజకవర్గంలో ప్రచారం వినిపిస్తుంది. ఓటర్లు సైతం మూడు పార్టీల అభ్యర్థులు ఇచ్చే డబ్బులు తీసుకుంటూ..తమ ఇళ్లలోని ఓట్లను పార్టీల వారిగా తలో రెండు, ఒకటి చొప్పున వేయాలని నిర్ణయించుకుంటుండటం ఆసక్తికరం. ఈ నేపథ్యంలో డబ్బుల, నజరానాల పంపిణీతో సాధించే ఓట్లు అభ్యర్థులను గెలుపు తీరానికి తీసుకొచ్చినా…ప్రలోభాలకు దూరంగా ఉండే ఓట్లర్లే గెలుపుకు, మెజార్టీకి సంబంధించి నిర్ణయాత్మకంగా మారవచ్చంటున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 4 లక్షల 1,365 మంది ఓటర్లు ఉండగా.. ప్రధాన పార్టీ అభ్యర్థులు సగం మందికి డబ్బులు పంపిణీ చేసినా మొత్తంతో పాటు ప్రచార ఖర్చులు కలిపి చూస్తే..ఎన్నికలలో ఒక్కో అభ్యర్థి రూ.100కోట్ల మేరకు ఖర్చు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది.
