కత్తులు నూరుతున్న కడియం, ఎర్రబెల్లి

ఇద్దరికిద్దరు పేరొందిన నాయకులు.. ఒకరు కడియం శ్రీహరి, మరొకరు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు పరస్పరం కత్తులు నూరుకుంటున్నారు.

  • Publish Date - April 8, 2024 / 11:20 AM IST

కడుపులో కత్తులతో…. కలిసుంటారు!
ఇద్దరు నాయకులు పరస్పర విమర్శలు
ఇద్దరూ టీడీపీతో రాజకీయ రంగ ప్రవేశం
నిన్నటి వరకు బీఆర్ఎస్ లో దగ్గరి మిత్రులూ
ఇప్పుడూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు

ఇద్దరికిద్దరు పేరొందిన నాయకులు..

ఒకరు కడియం శ్రీహరి, మరొకరు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు పరస్పరం కత్తులు నూరుకుంటున్నారు. ఈ ఇద్దరూ పరిచయం అక్కరలేని పేర్లు…కలిసున్నప్పుడు వీరిద్దరూ ఒకరికి మించి మరొకరు అన్నట్లు మిత్రులుగా కన్పిస్తారు. ఒకరి పైన మరొకరు ఎక్కడలేని ప్రేమాభిమానం ఒలకబోస్తారు. వేదిక పైన ఒకరినొకరు పొగుడుకుంటారు. విచిత్రంగా కొంచెం ఛాన్సు దొరికి, పరిస్థితి మారితే మాత్రం అప్పటి వరకు కడుపులో దాచుకున్న కత్తులు బయటికి తీస్తారనేది వీరిద్దరిని బాగా తెలిసిన సన్నిహితులు అంటారు. తాజాగా వీరిద్దరు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి గిట్టదు అన్నట్లు తీవ్ర విమర్శలు చేసుకోవడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న ఇద్దరి నాయకుల్లో కడియం అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. దీంతో నిన్నటి వరకు అలాయ్ భలాయ్ తీసుకున్న నేతలు ఒకరిపై ఒకరు నిప్పులు కురిపిస్తున్నారు. విమర్శలు తీవ్రం చేశారు. ఒక్కసారిగా రాజకీయ శత్రువులుగా మారిపోయారు.
ఎర్రబెల్లి, కడియం ఇద్దరు మాజీ మంత్రులు…ఎంపీలుగా చేశారు. కడియం అదనంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇద్దరి రాజకీయ జీవితం టీడీపీలో ప్రారంభమైంది. గత నాలుగు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరొందిన నాయకులు కావడం విశేషం. ప్రస్తుతం ఇద్దరూ తమ రాజకీయ చరమాంకంలోకి చేరుకున్నారు. తెలంగాణ ఉద్యమకాలమంతా వీరిద్ధరూ టీడీపీలో ఉన్నారు.ఇద్దరూ తమ రాజకీయరంగ ప్రవేశం చేసిన టీడీపీకి గుడ్ బై చెప్పి పార్టీలు మారారు. కాకుంటే ఒకరు ముందు, మరొకరు కాస్త వెనుక అంతే మరి. రాష్ట్ర ఏర్పాటుకు కొద్ది రోజుల ముందు కడియం అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. టీడీపీలో అన్ని రకాల పదవులు అనుభవించారు. ఆయన టీఆర్ఎస్ లో చేరగానే ఆయనకు అన్నీ కలిసొచ్చాయి. కడియం మాటల్లో చెప్పాలంటే అవకాశాలు తనను వెదుక్కుంటూ వచ్చాయి…వాటిని తాను వినియోగించుకున్నట్లూ… అదే విధంగా టీఆర్ఎస్ లో సైతం ఎంపీ, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా అవకాశం దక్కించుకున్నారు. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి 2014లో టీడీపీ పక్షాన పోటీ చేసి గెలిచారు. టీడీపీకి షాకిచ్చి మధ్యలో టీఆర్ఎస్ తీర్దం పుచ్చుకున్నారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ఎర్రబెల్లి ఓడిపోగా, కడియం ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్ఎస్ లో ఇద్దరు నాయకులు తిరిగి దాదాపు ఎనిమిదేళ్ళు కలిసి సాగారు. మళ్ళీ ఇద్దరి మధ్య ఎక్కడలేని ఆప్యాయత కనిపించింది. మొన్నటికి మొన్న స్టేషన్ ఘన్ పూర్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియానికి దక్కగానే ఎర్రబెల్లి అక్కడ ప్రత్య-క్ష్యమై కడియం గెలుపు ఖాయమంటూ మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గంలో కడియం పర్యటించి ఎర్రబెల్లికి మద్ధతునందించారు. కానీ, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల్లో కడియం కాంగ్రెస్ చేరడంతో ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు తీవ్రమయ్యాయి. ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు.

కడియం పై ఎర్రబెల్లి ఫైర్

ఇద్దరు నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడిని పెంచుతున్నారు. కడియం శ్రీహరితో పాటు వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా ఎంపిక చేసిన ఆయన కుమార్తె కడియం కావ్యతో సహా బీఆర్ఎస్ నుంచి రాత్రికిరాత్రే కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ నుంచి పోటీకి కావ్య బరిలో నిలిచారు. ఈ చర్య బీఆర్ఎస్ వర్గాలను హతాశులను చేసింది. ఈ పరిణామం జరుగగానే నష్టనివారణ చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎర్రబెల్లి కడియం పై విరుచుకపడ్డారు. కడియం బీఆర్ఎస్ కు ద్రోహం చేశారని మండిపడ్డారు. పార్టీ అన్ని అవకాశాలిస్తే అనుభవించి కష్టకాలంలో కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు. కావ్యకు టికెట్ ఇవ్వదొద్దని తాను చెప్పానని, ఇస్తే ఓడిపోతుందని చెప్పినా పార్టీ టికెట్ ఇచ్చిందన్నారు. కావ్యను ఈ ఎన్నికల్లో ఓడించి శ్రీహరికి బుద్ది చెప్పాలని పిలుపు నిచ్చారు.

ఎర్రబెల్లి పై కడియం ఆగ్రహం

తనను విమర్శించిన ఎర్రబెల్లి పై కడియం శ్రీహరి తీవ్రంగా విరుచుకపడ్డారు. మీడియా సమావేశంలో కడియం మాట్లాడుతూ ఎర్రబెల్లికి తనను విమర్శించేందుకు సిగ్గుండాలన్నారు. వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన తర్వాత కూడా తన మనుమరాలంత వయస్సున్న అమ్మాయి చేతిలో ఓడిపోయినందుకు సిగ్గుండాలంటూ హేలన చేశారు. వయస్సు పెరిగింది తప్ప ఎలా ఉండాలో తెలుసుకోలేదంటూ విమర్శించారు, ఏకనాథ్ షిండేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారు… ఇప్పటికీ ఆ పార్టీలోని అనేక మంది నాయకులు తాను పార్టీ మారుతాను…తన పై ఉన్న కేసులు ఎత్తేయండి అంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులను కోరుకుంటున్నారని కడియం చెప్పారు. కడియం విమర్శలకు శనివారం ఎర్రబెల్లి మరోసారి స్పందించారు. పదవుల కోసం పార్టీలు మారిన శ్రీహరి తనను విమర్శించడం సిగ్గుచేటన్నారు. నాలుగు సార్లు చిత్తుచిత్తుగా ఓడిపోయిన శ్రీహరి తన ఓటమి గురించి మాట్లాడడం విచిత్రమన్నారు. తన నలబై యేండ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నా ఈ ఎన్నికల్లో కడియం కావ్య చిత్తుచిత్తుగా ఓడిపోతుందని మండిపడ్డారు. తాజా ఎర్రబెల్లి విమర్శల నేపథ్యంలో కడియం స్పందనతో ఎన్నికలు ముగిసే వరకు ఇరువురి మధ్య మాటల యుద్ధం సాగనున్నది.

Latest News