-
- గోదావరిని ఎత్తుకపోతున్న మోదీ
- నోరెత్తని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- అడ్డగోలు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్
- తెలంగాణకు అన్యాయం జరిగితే సహించను
- అందుకే ఈ వయసులోనూ కష్టపడుతున్నా
- నన్ను ప్రచారం నుంచి 48 గంటలు నిషేధిస్తే..
- నా కార్యకర్తలు 96 గంటలు పనిచేస్తారు
- అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్‌పై చర్యలేవి?
- మానుకోట రోడ్ షోలో బీఆరెస్ అధినేత కేసీఆర్
విధాత ప్రత్యేక ప్రతినిధి: ‘ఇవాళ ఈసీ నా మీద నిషేధం విధించింది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం చేయొద్దని ఆదేశించింది. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలు వేసుకుంటా.. నీ గుడ్లు పీకుతా అని అడ్డగోలు మాటలు మాట్లాడితే నిషేధం పెట్టలేదు’ అని మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ఈ 48 గంటలు తన ప్రచారాన్ని నిషేధిస్తే.. దాదాపు 96 గంటలు లక్షలాది బీఆర్ఎస్ కార్యకర్తలు అవిశ్రాంతంగా పని చేస్తారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన బస్సుయాత్ర బుధవారం సాయంత్రం మానుకోటకు చేరుకున్నది. ఇక్కడ ఆ పార్టీ ఎంపీ అభ్యర్ధి మాలోత్ కవితకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్‌కు ఎన్నికల కమిషన్ 48 గంటల ప్రచార నిషేధాన్ని విధించిన నేపథ్యంలో తన ప్రసంగాన్ని తగ్గించి మాట్లాడారు. గోదావరి నదిని మోదీ ఎత్తుకుపోతున్నా నోరెత్తకుండా సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. ప్రధానిగా మోదీ దేశానికి చేసిందేమీలేదంటూ మండిపడ్డారు. జనధన్ ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని చెప్పి చేయలేదన్నారు. బేటీ పడావో, బేటీ బచావో… అమృత్ కాల్.. మన్నూ మషాణం అంటూ ఊదరగొట్టడం తప్ప చేసిందేమీలేదని విమర్శించారు. ఇప్పటికే కృష్ణానదిని కేఆర్ఎంబీకి అప్పజెప్పారని, గోదావరిని మోదీ ఎత్తుకపోతున్నా అడ్డుకోవడంలేదన్నారు. తెలంగాణకు ఏ అన్యాయం జరిగినా తాను సహించలేనని, ఈ వయస్సులో కూడా నేను తెలంగాణను కాపాడాలని యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తన ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు.
అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారం
కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలిచ్చి, అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. ఆరుగ్యారంటీల పేరుతో ఆగం చేశారని అన్నారు. రైతుల ఉసురుతీస్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు వచ్చిందా? నెలకు రూ.2500 వచ్చాయా? తులం బంగారం వచ్చిందా? అంటూ హాజరైన జనాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా లేదంటూ జనం ప్రతిస్పందించారు. ఉచిత బస్సుపెడితే వందలాది మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఉచిత బస్సు పథకానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఒక పథకం ప్రవేశపెడితే దాని వల్ల నష్టపోయేవారిని ఆదుకోవాలని చెప్పారు.
మానుకోట జిల్లాను రద్దు చేస్తారట
మానుకోట జిల్లాను రద్దు చేస్తారట జిల్లా ఉండాలా? వద్దా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సీఎం రేవంత్ రెడ్డి మెడలు వంచి జిల్లాను కాపాడుకోవాలని, కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. గతంలో 50 యేండ్ల కాంగ్రెస్ పాలనలో మహబూబాబాద్‌కు తాగు నీళ్ళు వచ్చేవికావని, తాను వచ్చిన తర్వాత వెన్నవరం కాలువ తవ్వి కాళేశ్వరం ద్వారా నీళ్ళిచ్చామని తెలిపారు. ఈ సంవత్సరం నీళ్ళు లేవని, బోరు బండ్లు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల ఆత్మహత్యలు
కాంగ్రెస్ దుష్టపాలనలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని కేసీఆర్ అన్నారు. చొప్పదండిలో వడ్లు కొనకపోతే రైతు గుండె కల్లంలోనే ఆగిపోయిందని చెప్పారు. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఖమ్మం, మహబూబాబాద్, నర్సంపేట ప్రాంతాల్లో మంచినీళ్ళు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం మారగానే కరెంట్ పోయిందన్న కేసీఆర్.. భగీరథ ఏమైపోయిందని ప్రశ్నించారు.
గిరిజనులకు ఎన్నో చేశాం
కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు చేసేందేమీలేదని కేసీఆర్ అన్నారు. బీఆరెస్ హయాంలో గిరిజనుల కోసం ఆత్మగౌరవ భవనం కట్టించామని, సేవాలాల్ జయంతి నిర్వహించామని, 10శాతం రిజర్వేషన్లు పెంచామని తెలిపారు. తండాలను గ్రామపంచాయతీలు చేశామని చెప్పారు. ఈ ఎన్నికల్లో గిరిజనుల ప్రతాపం చూపెట్టాలని కోరారు. రైతులకు 15వేలు వచ్చాయా? కూలీలకు నెలకు రూ.12 00 వచ్చాయా? అంటూ అడిగారు. రైతులకు రూ.500 బోనస్ లేదన్నారు. మాటలతో మాయచేసిన కాంగ్రెస్ ను నిలదీయాలంటే ఈ ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని, లేకుంటే కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలు పండబెడుతారని హెచ్చరించారు. బీఆరెస్ అభ్యర్థి కవితను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. భారీగా జనం హాజరయ్యారు.