Khairatabad Ganesh | హైదరాబాద్ : వినాయక చవితి( Vinayaka Chavithi ) ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 6వ తేదీన గణేశ్ నిమజ్జన( Ganesh Immersion ) కార్యక్రమం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా గణేశ్ మహా శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు ఉన్నతాధికారులు( Police Officers ) ఏర్పాట్లు చేశారు. బాలాపూర్( Balapur ) నుంచి ట్యాంక్ బండ్( Tankbund ) వరకు కొనసాగే మహా శోభాయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక ఖైరతాబాద్ గణనాథుడి( Khairatabad Ganesh )ని దర్శించుకునేందుకు కూడా భక్తులు( Devottes ) భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్నటి వరకు 12 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవాళ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఎల్లుండే నిమజ్జనం. నిమజ్జన ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు.. గురువారం అర్ధరాత్రి అంటే 12 గంటల నుంచి ఖైరతాబాద్ గణనాథుడి దర్శనాలకు బ్రేక్ వేయనున్నారు. కాబట్టి ఇవాళ రాత్రికి భక్తులు భారీ సంఖ్యలో గణనాథుడిని దర్శించుకునే అవకాశం ఉంది. బుధవారం ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి వద్ద తోపులాట జరిగి పలువురు భక్తులు స్పృహ కోల్పోయారు. శనివారం రోజు ఖైరతాబాద్ వినాయకుడిని ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య నిమజ్జనం చేయనున్నారు.
హైదరాబాద్ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను నిమజ్జనానికి సిద్ధం చేశారు. ప్రధాన చెరువుల వద్ద 130 స్థిర, 259 మొబైల్ క్రేన్లు, 56,187 లైట్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద 9 బోట్లు, డీఆర్ఎఫ్ బృందాలు, 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. 30 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉండనున్నారు.