- సీఎం భాష తీరు మార్చుకోవాలి
- ప్రతిపక్షాలను తిట్టడంమాని ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలి
- సోషల్ మీడియాపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అవకాశవాదం
- బీఆర్ఎస్ అవినీతిపై విచారణల పేరుతో కాలయాపన
- సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్
విధాత : సీఎం రేవంత్ రెడ్డి తన భాష తీరు మార్చుకోవాలని.. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేయాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సూచించారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి… ప్రభుత్వం ఏం చేస్తుందో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. బుధవారం హైదరాబాద్ లోని తన నివాసంలో రాష్ట్ర డిజిటల్ మీడియా ప్రతినిధులు రాజగోపాల్ రెడ్డిని కలిసి తమకు మద్దతుగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు మాత్రమే ఇస్తున్నానని.. విమర్శలు చేయడం లేదంటునే విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్లు ఉందన్నారు. తాను ప్రజల అభిప్రాయం మాత్రమే చెబుతున్నానన్నారు. ఎక్కడ తప్పు జరుగుతుందో చెప్పకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుందని..అందుకే చెప్తున్నానన్నారు. అందరం కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఐదేళ్లు అధికారంలోనే ఉంటుందని చెప్పుకొచ్చారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయటపెడతానన్నారు. ఇంకా మూడున్నరేళ్ళు రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి..ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దాం అని వ్యాఖ్యానించారు. ఏఐసీసీ అధిష్ఠానం తనకు మంత్రి పదవి హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకుందన్నారు. తన మంత్రి పదవి హామీ విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి వీలైనంత తొందరగా మంత్రి పదవులను భర్తీ చేసి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. కాళేశ్వరం.. విద్యుత్తు ఒప్పందాల్లో..ఫార్ములా ఈ రేసు కేసు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ వంటి అవినీతి కేసులలో విచారణల పేరుతో కాలయాపన చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ కేసులలో కమిషన్లు, విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మిమర్శించారు