నాకు మంత్రి పదవి రాకుండా మొక్కుకోండి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

నాకు మంత్రి పదవి రాకుండా బీఆరెస్‌లోని అవినీతి నాయకులు దేవుడికి మొక్కుకోవాలని, తనకు మంత్రి పదవి వస్తే ఊరుకునే మనిషిని కాదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Publish Date - April 26, 2024 / 06:00 PM IST

వస్తే బీఆరెస్ అవినీతి నాయకులందరు జైలుకే

విధాత, హైదరాబాద్‌ : నాకు మంత్రి పదవి రాకుండా బీఆరెస్‌లోని అవినీతి నాయకులు దేవుడికి మొక్కుకోవాలని, తనకు మంత్రి పదవి వస్తే ఊరుకునే మనిషిని కాదని, బీఆరెస్ అవినీతి నాయకులందరిని జైలుకు పంపిస్తానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ ఇంచార్జి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోరుతూ స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి శుక్రవారం పోచంపల్లిలో రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లడం ఖాయమని, వారితో పాటు మన జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా జైలుకు వెళతాడని అన్నారు. జగదీష్ రెడ్డి తొందర పడాల్సిన అవసరం లేదని, ఆయనకు వెయ్యి కోట్ల ఆస్తి ఉందని, నాగారంలో బంగ్లాతో పాటు భూములు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు.

హైదరాబాద్ లో బినామీ పేర్లతో ఎన్ని ఆస్తులు ఉన్నాయో బయటకి తీసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.క విత తీహార్ జైల్లో ఉందని, కేసీఆర్, కేటీఆర్ కూడా త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్నారు. 10 సంవత్సరాలు అబద్ధాలతో మాయమాటలతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల పాలు చేశాడని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆరెస్ ఎమ్మెల్యేలు, నాయకులు జేబుల్లో కాంగ్రెస్ కండువాలు పెట్టుకొని తిరుగుతున్నారన్నారు.

రాష్ట్రంలో బీఆరెస్ ఖేల్ ఖతమ్‌

పార్లమెంటు ఎన్నికల అనంతరం కేసీఆర్ దవాఖానకు.. కారు కార్ఖానాకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్రంలో బీఆరెస్ ఖేల్ ఖతమైందన్నారు. హరీష్ రావుకు రైతులు, ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. దళితున్ని ముఖ్యమంత్రి చేయకుంటే మీ మామ కేసీఆర్ తల నరుక్కుంటాను అన్నాడని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి ఎటుపాయే అని ప్రశ్నించారు.

బూర నర్సయ్య గౌడ్ దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతున్నాడని, నాకు దమ్ముంది కాబట్టే కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చామని, దమ్ముంది కాబట్టే కాంగ్రెస్ అధిష్టానం తనకు భువనగిరి లోక్‌సభ ఇంచార్జిగా పెట్టిందన్నారు. బూర నర్సయ్య గౌడ్ అంటే ఒక డాక్టర్‌గా తమకు మంచి గౌరవం ఉందని, అవాకులు మాట్లాడకుండా ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.

2009లో తనను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారని, 2019లో అన్న వెంకట్ రెడ్డిని గెలిపించారని, 2024లో తన తమ్ముడు వంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భీమనపల్లి చెరువు తన సొంత ఖర్చుతో అభివృద్ధి చేశానని, 2012 లో కరువు వచ్చి పశువులకు పశుగ్రాసం లేక తాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే తన సొంత ఖర్చుతో అందించినట్లు తెలిపారు. తాను రైతు బిడ్డగా చెబుతున్నానని గోదావరి జలాలతో బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా పోచంపల్లి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు.

Latest News