Site icon vidhaatha

ఎన్నికల వ్యూహంగానే యూటీ మాటలు!.. ప్రచారాస్త్రం కోసం బీఆరెస్ పాట్లు

విధాత, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దెబ్బతిన్న బీఆరెస్.. పార్లమెంటు ఎన్నికల్లోనైనా సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది. అయితే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో ఆ రెండు పార్టీలను దాటి ఓటర్లు బీఆరెస్‌కు ఓటువేసేలా వ్యూహాలు పన్నుతున్నట్టు కనిపిస్తున్నది. ఇందుకోసం పలు అంశాలను ప్రచారంలో లేవనెత్తుతున్నప్పటికీ.. ఒకవైపు రాముడు, మతపరమైన రిజర్వేషన్ల అంశంపై బీజేపీ, రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగ మార్పుపై కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారంతో బీఆరెస్‌ లేవనెత్తుతున్న అంశాలు ఆ పార్టీ ఆశించినంతగా ప్రజల్లో వెళ్లటం లేదనే చర్చ నడుస్తున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ను యూటీ చేస్తారని బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరికొంతకాలం కొనసాగిస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు కొత్త ప్రచారాన్ని ఎత్తుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి, ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బీఆరెస్‌కు ట్యాగ్‌లైన్ ప్రచారాంశం కొరత స్పష్టంగా కనిపిస్తూ వస్తున్నది. ఇప్పటిదాకా జరిగిన ప్రచార సభల్లో కేసీఆర్, కేటీఆర్‌, హరీశ్‌రావు తమకు కలిసొచ్చిన తెలంగాణ సెంటిమెంట్‌.. ఉద్యమకాలం నాటి ప్రచారాంశాలలో భాగమైన కృష్ణా, గోదావరి నదీ జలాల సమస్యలు, రైతులు, ప్రజల సాగు, తాగునీటి సమస్యలు, విద్యుత్తు సమస్యలపై ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాస్త్రాల ముందు బీఆరెస్ లేవనెత్తిన అంశాలు రొటీన్‌గా ఉండటంతో బీఆరెస్ జనాన్ని కదిలించే అంశాన్ని వెతికే పనిలో ఆ పార్టీ నాయకత్వం పడిందని అంటున్నారు.

అందుకే యూటీ.. ఉమ్మడి రాజధాని!
పార్లమెంటు ఎన్నికల్లో ఉనికి కోసం పోరాడుతున్న బీఆరెస్‌కు ఒక్క సీటు కూడా రాదని కాంగ్రెస్, బీజేపీలు భయపెడుతున్నాయి. పలు సర్వే సంస్థలు సైతం అటు ఇటుగా అవే కథనాలను వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా బడా నాయకులు.. క్యాడర్‌ ఒక్కొక్కరుగా పక్క పార్టీల్లోకి వలసలు పోతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌కు గౌరవప్రదమైన స్థానాలు దక్కకపోతే ఈ వలసలు మరింత పెరుగుతాయన్న బెంగ గులాబీ నాయకత్వాన్ని పీడిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీని, క్యాడర్‌ను కాపాడుకోవాలంటే పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఐదారు స్థానాలైనా గెలవాల్సిన అనివార్య పరిస్థితి పార్టీ నాయకత్వానికి విషమ పరీక్ష పెడుతున్నదని అంటున్నారు. అయితే రాష్ట్రంలో ముక్కోణపు పోటీలో బీఆరెస్ వెనుకబడిపోయిందన్న ప్రచారాన్ని అధిగమించి జనంలో తాము గెలుస్తున్నామన్న నమ్మకాన్ని కల్గించాలంటే ప్రచారం చివరి దశలోనైనా దూకుడు పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే హరీశ్‌రావు మరోసారి ఉమ్మడి రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారని పరిశీలకులు అంటున్నారు.

రాష్ట్ర విజభన ప్రకారం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని గడువు ముగిసినప్పటికీ, దానిని పొడిగించాలని చూస్తున్నారని, ఇందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సంచలన విమర్శలు చేశారు. వాళ్ల ఆటలు సాగకూడదనుకుంటే లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్‌ను గెలిపించాలంటూ కొత్తరాగం అందుకున్నారు. బీఆరెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సైతం అదే తరహా వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసి, ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది జూన్ 2 వరకే హైదరాబాద్ నగరం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉంటుందని.. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారంటూ కీలక కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరిందని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకునేది బీఆరెస్‌ పార్టీ మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో మళ్లీ ఉమ్మడి రాజధాని..హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాబోతుందన్న భయాలను, బెంగను ప్రజల్లో రగిలించి అలా జరుగకూడదంటే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ఇంటిపార్టీ బీఆరెస్‌ను గెలిపించాలని కోరుతున్నారు. మరో అడుగు ముందుకేసి 2026 నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ (డీలిమిటేషన్)లో తెలంగాణకు అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి, బీజేపీ రాజ్యాంగం మార్చకుండా ఆపే పవర్ కూడా బీఆరెస్‌కే ఉందని, అందుకు లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్‌ను 12 ఎంపీ సీట్లలో గెలిపించాలని కోరుతున్నారు.

యూటీ నిర్ణయం సాధ్యమేనా!
నిజానికి హరీశ్‌రావు, కేటీఆర్‌ చెప్పినట్లుగా కేంద్రం హైదరాబాద్‌ను యూటీగా మార్చడం సాధ్యమేనా అన్న చర్చ సాగుతున్నది. హైదరాబాద్‌కు నలువైపులా రక్షణ శాఖ భూములు ఉండటం, రక్షణ పరంగా హైదరాబాద్ సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత పెద్దగా రాదనీ, ఒక వేళ వచ్చినా హస్తినను ఉదాహరణగా చూపి వ్యతిరేక గళాలను సముదాయించవచ్చని గతంలో కేంద్ర వర్గాలు భావించాయి. బీఆరెస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో రాష్ట్ర విభజనకు ముందు.. ఏదో విధంగా రాష్ట్రం సాధించుకోవడమే లక్ష్యంగా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అన్న ప్రతిపాదనకు ఒక దశలో మొగ్గు చూపినట్టు వార్తలు వచ్చినా.. చివరకు ప్రజాభిప్రాయం మేరకు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ నినాదానికే కట్టుబడ్డారు. దక్షిణ భారత దేశంలో కీలక నగరంగా ఉన్న హైదరాబాద్‌ను యూటీగా చేసే అంశం తరచూ తెరపైకి వస్తూనే ఉంది. అయితే అలాంటి ఆలోచన ఏదీ బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించలేదు. దీంతో బీఆరెస్ నేతలు చెబుతున్నట్లుగా హైదరాబాద్ యూటీ అంశం పట్ల బీజేపీ కేంద్ర నాయకత్వం ఆసక్తిగా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఉమ్మడి రాజధాని ముచ్చట ముగిసిన అధ్యాయమే
హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని ప్రకటించిన గడువు ఈ ఏడాది జూన్‌ 2తో ముగుస్తుంది. హరీశ్‌రావు తాజాగా ఆరోపించినట్లుగా చంద్రబాబు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కావాలని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కోరకపోగా, టీడీపీకి అధికారం ఇస్తే అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే హైదరాబాద్‌ నుంచి అమరావతికి మకాం మార్చేసింది. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి స్థానంలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. 2019లో తెలంగాణ మంత్రివర్గం కోరిక మేరకు హైదరాబాద్‌పై హక్కులన్నీ జగన్ ప్రభుత్వం వదిలేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏపీకి సంబంధించిన ఒక్క కార్యాలయం కూడా లేదు. ఆ మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ మంత్రులు పలువురు మళ్లీ ఉమ్మడి రాజధాని అంశం తెరపైకి తెస్తే టీడీపీ తీవ్రంగా ఎదురుదాడికి దిగింది. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సైతం ఘాటుగా స్పందించారు. ఏపీకి అమరావతే రాజధాని అని బీజేపీ చెబుతోందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆత్మనిర్భర్ ఆంధ్రప్రదేశ్ కావాలి అని పిలుపునిచ్చారు. వేరే రాష్ట్రం నుంచి రాజధానిని తీసుకోవాల్సిన అగత్యం ఏపీకి లేదన్నారు. హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఇస్తే దాన్ని ఉపయోగించుకున్న దాఖలాలు లేవని,. మళ్లీ ఛలో హైదరాబాద్ అని ఎందుకంటున్నారని జీవీఎల్ విమర్శించారు. సొంత రాజధాని నిర్మించుకోలేకపోయిందన్న అప్రతిష్ఠ ఏపీకి ఎందుకు? మళ్లీ వెళ్లి పక్క రాష్ట్రంపై ఆధారపడతామనడం సబబేనా? అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌ సైతం మళ్లీ హైదరాబాద్ జోలికొస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు చట్టం తెచ్చేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజాసంక్షేమ సేవ సంఘం కార్యదర్శి పొదిలి అనిల్‌కుమార్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో నిర్దేశించిన చట్టబద్ధమైన విధులు నిర్వర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న కంపెనీలు, కార్పొరేషన్ల ఆస్తుల విభజన పూర్తి కాలేదని తెలిపారు. వివాదాలు పరిష్కారమయ్యేవరకు మరో పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ చట్టం చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. చట్టం చేయాలని పార్లమెంట్‌ను తాము ఎలా ఆదేశించగలమని ప్రశ్నించింది. ఆ వ్యాజ్యాన్ని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి రాజధాని అంశం ముగిసిన అధ్యాయమని.. ఇప్పుడు బీఆరెస్ నేతలు చేస్తున్న హైదరాబాద్ ఉమ్మడి రాజధాని.. లేక యూటీ ప్రచారం అంతా ఎన్నికల వ్యూహాంగానే చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Exit mobile version