Leopard | మెదక్ : మెదక్ – ఎల్లారెడ్డి రోడ్డులో చిరుత పులులు కలకలం సృష్టించాయి. శనివారం తెల్లవారుజామున ఆ రోడ్డు మార్గంలో వెళ్తున్న వాహనదారులకు ఓ చిరుత పులి కంటపడింది. చిరుత రోడ్డు దాటుతుండడంతో వాహనదారులు తమ వెహికిల్స్‌ను ఆపేశారు.
ఓ కారులో ఉన్న వ్యక్తులు రోడ్డు పక్కన నిల్చున్న చిరుతను తమ కెమెరాల్లో బంధించారు. అయితే చెట్ల పొదల్లో మరో చిరుత ఉందని ఆ వీడియోలో వాహనదారులు మాట్లాడుకున్నారు. చెట్ల పొదల్లో ఉన్న చిరుత గాండ్రిస్తుందని చెప్పారు. ఇక ఈ వీడియోను హవేలిఘన్‌పూర్ పోలీసు స్టేషన్ ఎస్ఐ పోచన్నకు పంపారు. అప్రమత్తమైన ఎస్ఐ.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు, పోలీసులు చిరుతలు సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.
శాలిపేట గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. పశువుల కాపర్లు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా ఎవరూ కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని చెప్పారు. మెదక్ – ఎల్లారెడ్డి రోడ్డు పొడవునా అక్కడక్కడ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చిరుతలు సంచరిస్తున్నాయి.. జాగ్రత్త అని వాహనదారులను, స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. చిరుతల సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మెదక్ జిల్లాలోని హవేలీఘన్పూర్ మండల పరిధిలోని భూత్పూర్ ఫారెస్ట్ బ్లాక్‌లో చిరుతపులులు ప్రత్యక్షం.. pic.twitter.com/wzfvNoQSf0
— vidhaathanews (@vidhaathanews) July 6, 2024