విధాత, హైదరాబాద్ : మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, సికాస కార్యదర్శి బండి ప్రకాశ్(Maoist leader Bandi Prakash)లొంగిపోయారుSurrender,. డీజీపీ శివధర్‌రెడ్డి(DGP Shivadher Reddy) సమక్షంలో ఆయన మంగళవారం లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన.. మావోయిస్టు పార్టీలో 45 ఏళ్లు వివిధ స్థాయిల్లో పనిచేశారు. ప్రభాత్ అనే పేరుతో ప్రెస్‌టీమ్ ఇన్‌చార్జిగా కూడా బండిప్రకాశ్ బాధ్యతలు నిర్వర్తించారు. అనారోగ్య కారణాలతో ఆయన లొంగిపోయారని తెలుస్తోంది.
బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, అశోక్, క్రాంతి.. స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. ప్రకాశ్ తండ్రి సింగరేణి కార్మికుడు. 1982–84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్ యూ) తరపున విప్లవోద్యమంలోకి అడుగుపెట్టాడు. ఆపై మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా, అక్కడి నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. 1988లో బెల్లంపల్లిలో సీపీఐ నేత అబ్రహం హత్య కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లారు. ఆదిలాబాద్ సబ్ జైలులో శిక్షను అనుభవిస్తూనే నాటి పీపుల్స్‌వార్ ముఖ్య నేతలైన నల్లా ఆదిరెడ్డి, మహమ్మద్ హస్సేన్, ముంజ రత్నయ్య గౌడ్ తదితరులతో కలిసి సబ్ జైలు గోడలను బద్దలుకొట్టుకుని పోలీసుల తుపాకులతో సహా చాకచక్యంగా తప్పించుకున్నారు. అయితే, అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. అనంతరం 1991లో మళ్లీ అరెస్ట్ అయిన బండి ప్రకాశ్ 2004లో విడుదలయ్యారు. సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల సమయంలో ఆయన జనజీవితంలోనే ఉన్నారు. అనంతరం చర్చలు విఫలం కావడంతో మళ్లీ అడవి బాట పట్టారు. గత 20 ఏళ్లుగా బండి ప్రకాశ్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు.కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రభావంతో ఆ పార్టీ కీలక సభ్యులు తమ దళాలతో వరుసగా లొంగిపోతున్నారు. ఆ క్రమంలో బండి ప్రకాశ్ కూడా జనజీవన స్రవంతిలో కలిశారు.
