Site icon vidhaatha

రైలు ప్రయాణంలో కూలిన మిడిల్‌ బెర్త్‌ .. కేరళ వ్యక్తి మృతి

వరంగల్‌: మృత్యువు ఎలా? ఎప్పుడు? పొంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. కేరళ నుంచి పంజాబ్‌ వెళ్లేందుకు రైల్లో బయల్దేరిన ఒక వ్యక్తి.. వరంగల్‌ స్టేషన్‌ వద్ద అనూహ్య ప్రమాదానికి గురై.. చికిత్స పొందుతూ చనిపోయాడు. మలప్పురంలోని పొన్నానికి చెందిన అలీఖాన్‌ (62) పంజాబ్‌లో ఒక బంధువును కలుసుకునేందుకు, అటు నుంచి ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు ఎర్నాకుళం-హజరత్‌ నిజాముద్దీన్‌ మిలేనియం సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో జూన్‌ 16న ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నదని గవర్నమెంట్‌ రైల్వే పోలీసు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్రిశూర్‌లో రైలెక్కిన అలీఖాన్‌.. స్లీపర్‌ కోచ్‌లోని లోయర్‌ బెర్త్‌లో నిద్రిస్తున్నాడు. రైలు వరంగల్‌ చేరుకున్న సమయంలో మిడిల్‌బెర్త్‌ ఉన్నట్టుండి ఒక్కసారిగా కిందికి జారింది. ఒకపక్కకు తిరిగి పడుకున్న అలీఖాన్‌ ఈ ఘటనతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెన్నెముక, మెడపూసలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయన కదల్లేని స్థితికి చేరుకున్నాడు. హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.
ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ ప్రతినిధి వివరణ ఇస్తూ.. ఇది బెర్త్‌ లోపం వల్ల జరిగిన ఘటన కాదని, మిడిల్‌బెర్త్‌లో ప్రయాణికుడు చైన్‌ను అప్పర్‌బెర్త్‌కు సరిగ్గా తగిలించకపోవడంతోనే అది మధ్యలో ఊడిపోయి, ఈ ఘటన చోటు చేసుకున్నదని తెలిపారు. 15.6.2024 రాత్రి 7.34 గంటల సమయంలో ఈ సమాచారం అందగానే రైల్వే సిబ్బంది రామగుండం స్టేషన్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారని, డ్యూటీలో ఉన్న స్టేషన్‌ మాస్టర్‌ వెంటనే అంబులెన్సును సిద్ధం చేయించి, రైలు రామగుండం చేరుకోగానే అతడిని హాస్పిటల్‌కు తరలించారని పేర్కొన్నారు. మలప్పురంలోని పొన్నానిలో బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

Exit mobile version