Site icon vidhaatha

Minister Komatireddy | బీజేపీలో బీఆరెస్ విలీనం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అందుకే కేంద్ర బడ్జెట్‌ను వదిలేసి రాష్ట్ర బడ్టెట్‌పై కేసీఆర్‌ విమర్శలు
పది రోజుల్లో బ్రాహ్మణ వెల్లెంల ట్రయల్ రన్
అమెరికా నుంచి టీబీఎం మిషన్ రాగనే ఎస్‌ఎల్బీసీ పనులు
స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి రెండు నెలల్లో టెండర్లు

విధాత, హైదరాబాద్ : త్వరలో బీజేపీ పార్టీలో బీఆరెస్ విలీనం కావడం ఖాయమని, అందుకే బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు రూపాయి ఇవ్వని కేంద్ర బడ్టెట్‌పై పల్లెత్తు మాట అనకుండా సంక్షేమం, అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన రాష్ట్ర బడ్జెట్‌పై విమర్శలు చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపత్రి నేత బాధ్యతను మరిచి ఎనిమిది నెలలు ఫామ్‌హౌస్‌లో పడుకుని, ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్‌ను చీల్చిచెండాడుతానని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన పార్టీనే ప్రజలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చీల్చి చెండాడిన సంగతి మరిచిపోవద్దన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్రస్ కూడా లేకుండా చేస్తామన్నారు. ఉన్న బీజేపీలో బీఆరెస్ విలీనం ఖాయమని, ఇందుకు సంబంధించి మాకు సమాచారం ఉందన్నారు.

మాది రైతు ప్రభుత్వం అనడానికి నిదర్శనంగా రాష్ట్ర బడ్జెట్లో 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగిందన్నారు. 31 వేల కోట్ల రుణమాఫీకి నిధులు కేటాయించామన్నారు.భూమిలేని రైతు కూలీలకు ఇచ్చే 12 వేల రూపాయలను త్వరలోనే అమలు చేస్తామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం వ్యవసాయానికి ఎన్నడూ 72,000 కోట్లు రూపాయలు కేటాయించలేదని తెలిపారు. దేశ చరిత్రలోనే వ్యవసాయానికి సుమారు లక్ష కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్రం ఏది లేదన్నారు. పదేళ్ల పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి, తన దోపిడికి కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు కేటాయించుకున్న కేసీఆర్ ఈ ప్రాంత ప్రాజెక్టులకు కేటాయింపు చేసిన రాష్ట్ర బడ్జెట్‌పై విమర్శలు చేయడం దారుణమన్నారు.

ఎస్ఎల్బీసీ సొరంగం ,శివన్న గూడెం, బ్రాహ్మణ వెల్లేముల, పాలమూరు- రంగారెడ్డి ,సీతారామ వంటి ప్రాజెక్టుల పూర్తికి ఎక్కువ నిధులు కేటాయించిందన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధికి 29 వేల కోట్ల రూపాయలు, ఆర్‌ఆండ్‌బీకి 7315 కోట్ల రూపాయల కేటాయించిందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 75,577 కోట్ల రూపాయల మిగులు ఉండేదని, డిసెంబర్ 3, 2023 న 6,71357కోట్ల రూపాయలతో అప్పుల రాష్ట్రంగా గత ప్రభుత్వం అప్పగించిందన్నారు. 37 వేల కోట్ల రూపాయలు ఇందిరమ్మ 6 గ్యారంటీలకు అమలు కేటాయించామని, ఒకటో తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన దుబారా అప్పులు,వడ్డీ కలిపి 42 వేల కోట్లు చెల్లించామన్నారు.

పది రోజుల్లో బ్రాహ్మణ వెల్లేముల ట్రయల్ రన్ నిర్వహిస్తాం

ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో 1760కోట్లు కేటాయించగా, గ్రీన్ చానల్ ద్వారా ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో 800కోట్లు కేటాయించారని వెంకట్‌రెడ్డి తెలిపారు. అమెరికికా నుంచి ఆగస్టు రెండో వారంలో టీబీఎం మిషన్ రాబోతుందని, సాధ్యమైనంత త్వరగా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టులో పది రోజుల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తామని, డిసెంబర్‌లో కాలువలు పూర్తి చేయిస్తామన్నారు. డిండి ఎత్తిపోతల పనులను కూడా 300కోట్లతో పనులు ముందుకుపోనున్నాయన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 80 కోట్ల రూపాయలతో 20 ఎకరాలలో సమీకృత వసతి గృహాల నిర్మాణం చేపడుతున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి రెండు నెలల్లో టెండర్లు పిలువనున్నామని, 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఐబీఎం తరహాలో దీనిని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

Exit mobile version