విధాత, హైదరాబాద్ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై ముంబైలోని సీసీఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తాతో భేటీ అయ్యారు. అకాల వర్షాలతో పత్తి పంటలు దెబ్బతిన్నాయని ఈ సందర్బంగా కోమటిరెడ్డి వివరించారు. పత్తి పంట సాగు విస్తీర్ణం రాష్ట్రంలో 45 లక్షల ఎకరాలకు పైగా ఉండగా, ఈ సీజన్‌లో అకాల వర్షాలు, సైక్లోన్ ప్రభావం, పింక్ బోల్వార్మ్ పురుగు దాడులు, పెరిగిన ఉత్పత్తి ఖర్చులు రైతులను తీవ్రంగా ప్రభావితం చేశాయని తెలిపారు.
తేమ శాతం సడలించి 12% నుంచి 14% కి పెంచాలని విజ్ఞప్తి చేశారు. మద్దతు ధరను కూడా పెంచాలని కోరారు. అన్ని జిల్లాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ యార్డుల వద్ద తేమ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. పింక్ బాల్‌వార్మ్ చీడతో పత్తి పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రత్యేక ఉపశమన ప్యాకేజీ ఇవ్వాలని, పురుగు నిరోధక విత్తనాల పరిశోధన, పంపిణీ బలోపేతం చేయడం వంటి అంశాలను సూచించారు. గత సీజన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ యార్డుల వద్ద తేమ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వినతిని పరిశీలించిన సీసీఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తా వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంటరెడ్డి తో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఉన్నారు.
