Minister Komatireddy | రహదారుల అభివృద్ధికి త్వరలో కొత్త విధానం: మంత్రి కోమటిరెడ్డి

రోడ్లు, రహదారుల అభివృద్ధి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన భారత్ మాల స్థానంలో కొత్త విధానం రాబోతుందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు

  • Publish Date - June 24, 2024 / 08:15 PM IST

ఉప్పల్ ఘట్కేసర్‌ ఫై ఓవర్‌కు కొత్త టెండర్లు
కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి భేటీ
హైదరాబాద్ – విజయవాడ హైవేను ఆరు లైన్లు మార్చాలని వినతి

విధాత, హైదరాబాద్‌ : రోడ్లు, రహదారుల అభివృద్ధి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన భారత్ మాల స్థానంలో కొత్త విధానం రాబోతుందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితీన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంకు సంబంధించిన జాతీయ రహదారులు, రోడ్ల నిధులకు సంబంధించి చర్చించారు. అనంతరం వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “హైదరాబాద్-విజయవాడ హైవేను 6 లైన్ల రహదారిగా మార్చాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరామని తెలిపారు. ఉప్పల్-ఘట్కేసర్ మధ్య రహదారి 40 శాతమే పూర్తయిందని తెలుపగా, రహదారి పనులు త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఉప్పల్-ఘట్కేసర్ ఫ్లై ఓవర్ టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని గడ్కరీ ఆదేశించారని తెలిపారు.

రీజినల్ రింగ్ రోడ్డు పనులు ముందుకు సాగడం లేదని చెప్పగా, త్వరలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామని గడ్కరీ తెలిపారని వెంకట్‌రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడ్డ 16 రోడ్లపై వారికి నివేదిక ఇచ్చామని, వాటిలో కొన్నింటిని హైవేలుగా మార్చాలని కోరడంతో దానిపై సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. మళ్లీ రహదారుల మంత్రిగా గడ్కరీ రావడం సంతోషంగా ఉందని, మూడేళ్లలో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి రాష్ట్రానికి రావాల్సిన రహదారులు, రోడ్లకు నిధులు సాధిస్తామన్నారు. ఈ సందర్భంగా గడ్కరీని సన్మానించినట్లుగా వెంకట్ రెడ్డి తెలిపారు. సాయంత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసి రాష్ట్రానికి నిధుల సాధనలో సహకరించాలని కోరడం జరిగిందని చెప్పారు. మంగళవారం కేంద్రమంత్రులు కిషన్ రెడ్డిని, భూపేంద్ర యాదవ్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

Latest News