హుకుంలు, అల్టిమేటమ్‌లకు భయపడం
ఎన్డీఎస్‌ఏ సూచనల మేరకే ప్రభుత్వం నడుచుకుంటుంది
రాష్ట్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగిందనే నీతి అయోగ్ బహిష్కరణ
గతంలో కేసీఆర్ బహిష్కరణకు కారణమే లేదని విమర్శలు
విధాత, హైదరాబాద్ : ఆగస్టు 2తేదీకల్లా కాళేశ్వరం పంప్‌లను నడిపించాలని కేటీఆర్ హుకుంలు, అల్టిమేటమ్‌లిస్తే భయపడే వారెవ్వరు లేరని, ఆయనేమి యువరాజు కాదని, పంప్‌హౌజ్‌లు ఆన్ చేస్తామని, గేట్లు తెరుస్తమనడానికి మీరేమన్న పోటుగాళ్లా అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ధ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ దగ్గర నీరు పంప్ చేసే అవకాశం లేదని ఎన్డీఎస్‌ఏ చెప్పిందని, ప్రభుత్వం వారి సూచనల మేరకు నడుచుకుటుందన్నారు. తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టకపోవడం వల్ల, కాళేశ్వరం నిర్మాణం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందని ఆరోపించారు. విహార యాత్రకు వెళ్లినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆరెస్ ఎమ్మెల్యేల బృందం వెళ్లిందని విమర్విఇంచారు.
రైతుల ఫ్రయోజనాల కాపాడే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగిందన్న నిరసన వ్యక్తం చేసేందుకే నీతి అయోగ్ సమావేశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి బహిష్కరించడం జరిగిందన్నారు. గతంలో కారణం లేకుండా కేసీఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెళ్లలేదని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి 10 వేల కోట్లు కేటాయించిన సీఎంకు , డిప్యూటీ సీఎంకు ఇంచార్జి మంత్రిగా తాను కృతజ్ఞతలు తెలుపుతున్నాన్నారు. జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డు, మెట్రోలకు ప్రభుత్వం ఆర్థిక మద్దతునందించిందన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కు ఏం తెచ్చారని, టూరిజం మంత్రిగా ఉన్నా కిషన్ రెడ్డి చేసిందేమి లేదని, హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఉపయోగం లేకుండా పోతుందన్నారు. కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు కేంద్ర మంత్రలుగా కొనసాగే నైతికార్హత లేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి 10వేల కోట్ల నిధులు ఇచ్చినందుకా రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారని బీజేపీ శ్రేణులపై మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్ కు ముందే రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని, అయినా సహకారం దక్కలేదన్నారు. గంగా ప్రక్షాళనకు బడ్జెట్ కేటాయింపులు చేసిన కేంద్రం, మూసీ అభివృద్ధికి ఎందుకు నిధులివ్వరని ప్రశ్నించారు. నిధుల సాధనకు కేంద్రం వద్దకు కిషన్‌రెడ్డి అఖిల పక్షాన్ని తీసుకెలుతామంటే తమ ప్రభుత్వం సిద్ధమన్నారు. విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెలుతామన్నారు.