మంత్రుల మధ్య విభేదాలకు త్వరగా ఫుల్‌స్టాప్.. నేను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు : మంత్రి సీతక్క

మేడారం ఆలయ అభివృద్ధి పనుల విషయంలో పీసీసీ చీఫ్ మహేశ్ కమార్‌కు నేను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదని మంత్రి సీతక్క వెల్లడించారు. సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి, మీడియాలో వ‌చ్చిన‌ వార్తల‌ను పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్ళానని మంత్రి సీతక్క స్పష్టం చేశారు

హైదరాబాద్, అక్టోబర్ 12 (విధాత): మేడారం ఆలయ అభివృద్ధి పనుల విషయంలో పీసీసీ చీఫ్ మహేశ్ కమార్‌కు నేను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదని మంత్రి సీతక్క వెల్లడించారు. సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి, మీడియాలో వ‌చ్చిన‌ వార్తల‌ను పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్ళానని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చూడాలని పీసీసీ చీఫ్‌ను కోరానన్నారు. ఆదివాసి వీర వనితలు సమ్మక్క సారలమ్మ ఆలయం అభివృద్ధి పనుల చుట్టూ ఏ చిన్న పాటి వివాదం ఉండకూడదన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా పీసీసీ చీఫ్ దృష్టికి మీడియాలో వ‌చ్చిన వార్తలను తీసుకెళ్లానని మంత్రి సీతక్క పేర్కొ్నారు.

ఆలయ అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యమైనవి, వాటి చుట్టూ ఎలాంటి అపార్థాలు లేకుండా, పనులు సజావుగా పూర్తి కావాలి. సున్నితమైన అంశం కావడంతో, వీలైనంత త్వరగా అపార్థాలు తొలగిపోయి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగేలా చూడమని కోరానన్నారు. అంతే తప్ప నేను ఎవరి మీద పీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేయలేదన్నారు. మేడారం ఆలయం అభివృద్ధి మన అందరి బాధ్యత, పనులు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.