Minister Uttam | కాళేశ్వరం బ్యారేజీలను పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు

  • Publish Date - June 7, 2024 / 04:11 PM IST

మరమ్మతు పనులను వేగవంతం చేయాలని ఆదేశం
బీఆరెస్ నిర్వాకంతోనే 94వేల కోట్ల అప్పు మట్టి పాలైందని ఫైర్‌

విధాత : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఎన్డీఎస్‌ఏ మధ్యంతర నివేదిక మేరకు అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలలో జరుగుతున్న మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను జూన్ 10వ తేదీ వరకు పూర్తి చేయాల్సివున్న నేపథ్యంలో మరమ్మతు పనులను ఉత్తమ్ స్వయంగా పరిశీలించారు. అటు బ్యారేజీలను ఏరియల్ సర్వే ద్వారా కూడా పరిశీలించారు.

పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు ఉదృతమయ్యే అవకాశమున్నందునా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌ అధికారులకు సూచించారు. అనంతరం ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. పనుల పురోగతిని సమీక్షించారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అక్రమాల విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సైతం శుక్ర, శనివారాల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సందర్శనకు రానుండటంతో అధికారుల బృందం అక్కడే వారి కోసం వేచి ఉంది. మరోవైపు ఢిల్లీకి చెందిన సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చి స్టేషన్ బృందం మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

94వేల కోట్ల అప్పు మట్టికొట్టుకపోయింది : ఉత్తమ్‌

బీఆరెస్ నిర్వాకంతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో పాటు అన్నారం, సుందిళ్లలో భారీ లీకేజీలు ఏర్పడటం ద్వారా ప్రాజెక్టు నిర్మాణానికి తెచ్చిన 94వేల కోట్ల అప్పు మట్టి పాలైందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. బ్యారేజీల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ఆక్టోబర్ 21న మేడిగడ్డ రెండు పియర్లు కూలిపోగా, ఆ వెంటనే నీళ్లు కిందికి వదిలివుంటే ఇంత డ్యామేజీ జరిగి ఉండేది కాదని ఎన్డీఎస్‌ఏ మధ్యంతర నివేదిక ఇచ్చిందన్నారు. మేడిగడ్డ సహా మూడు బ్యారేజీల్లో నీటి నిల్వ చేయవద్దని ఎన్డీఎస్‌ఏ స్పష్టంగా చెప్పిందని తెలిపారు. ఎన్డీఎస్‌ఏ మధ్యంతర సూచనల మేరకు మూడు బ్యారేజీల మరమ్మతు పునరుద్దరణ పనులు జరిపిస్తున్నామన్నారు.

Latest News