Uttam Kumar Reddy : భూ సేకరణ పరిహారం రూ.33 కోట్లు విడుదల

నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పరిహారం కింద రూ.33 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై కూడా సమీక్ష నిర్వహించారు.

Uttam Kumar Reddy

విధాత, హైదరాబాద్ : నీటీ పారుదుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణకు రూ.33కోట్ల పరిహారాన్ని విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ . ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన నీటిపారుదల శాఖ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టుల పనులను సమీక్షించి భూసేకరణ పరిహారం విడుదలకు ఆదేశాలిచ్చారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం కొనసాగించాలన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల పునరుద్ధరణలో ఐఐటీ భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. వర్షాకాలం అనంతరం మరమ్మతుల ప్రణాళికలు రూపకల్పన చేసి..ఒక సంవత్సరంలో పనులు పూర్తి చేయాలని సూచించారు.

ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని..తుమ్మడిహట్టి వద్ద రెండు ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశీలన చేయాలని సూచించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డిండి ప్రాజెక్టుపై మూడు రోజుల్లో నివేదిక సమర్పణ ఆదేశించారు. రిజర్వాయర్ల సామర్థ్య పెంపు కోసం కొత్త విధానం సిద్ధం చేయాలన్నారు. ఐఎస్‌డబ్ల్యూఆర్డీ, సీడీఓ బలోపేతానికి ఉత్తమ్ సూచనలు చేశారు. అలాగే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II విచారణ పురోగతిపై సమీక్షించారు.