అభివృద్ధి పనులు వేగవంతం చేయండి: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

తన హుజూర్‌నగర్ నియోజకవర్గంతో పాటు కోదాడ నియోజకవర్గంలో ఇప్పటికే మంజూరైన పనులకు టెండర్లు పిలవడంతో పాటు చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు

  • Publish Date - June 24, 2024 / 08:40 PM IST

విధాత : తన హుజూర్‌నగర్ నియోజకవర్గంతో పాటు కోదాడ నియోజకవర్గంలో ఇప్పటికే మంజూరైన పనులకు టెండర్లు పిలవడంతో పాటు చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల సమీక్షా సమావేశాన్ని కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి రెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీలోని పెద్ద చెరువు వద్ద మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధికి రూ 8కోట్లు, మున్సిపాలిటీలో టౌన్ హాల్ నిర్మాణానికి రూ 6.00 కోట్లు, ఖమ్మం ఎక్స్ రోడ్స్ జంక్షన్ అభివృద్ధికి రూ. 50.00 లక్షలు, కోదాడ మున్సిపాలిటీలోని హైదరాబాద్ రోడ్, విజయవాడ రోడ్లలో స్వాగత తోరణాల (ఆర్చిల) నిర్మాణానికి రూ 1.10 కోట్లు విడుదలచేయనున్నట్లుగా తెలిపారు.

కోదాడ మున్సిపాలిటీలోని చెరువుకట్ట బజార్ నుండి అనంతగిరి రోడ్డు వరకు మేజర్ అవుట్‌ఫాల్ డ్రెయిన్ నిర్మాణానికి రూ 4.40 కోట్లు విడుదల చేయనున్నట్గుగా తెలిపారు. కోదాడ మున్సిపాలిటీకి అదనపు ఔట్ సోర్సింగ్ శానిటరీ సిబ్బందిని మంజూరు చేస్తారని, హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీలో ఈద్గా, శ్మశాన వాటికలు, సీసీ రోడ్ల అభివృద్ధికి రూ 3.0 కోట్లు విడుదల చేయనున్నామని తెలిపారు. విందపురం వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం రూ 2.0 కోట్లు విడుదల చేస్తారని, ధోభి ఘాట్ నిర్మాణం కోసం రూ 2.0 కోట్లు, మున్సిపాలిటీకి ఒక స్వీపింగ్ మిషన్ ఇవ్వబడుతుందని వెల్లడించారు. నేరేడుచర్ల మున్సిపాలీటీలో వివిధ అభివృద్ధి పనులకు రూ. 15.00 కోట్లు విడుదల చేస్తామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Latest News