విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ బారేజీల పునరుద్ధరణకు శాస్త్రీయ చర్యలు తీసుకుంటామని, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బారేజీల రక్షణకు చర్యలు చేపడుతామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ, సీడబ్ల్యుపీఆర్‌ఎస్ పర్యవేక్షణలో బారేజీల పునరుద్ధరణ చేస్తామన్నారు. కాళేశ్వరం సహా పలు సాగు నీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షనిర్వహించారు. సమ్మక్క సారక్క, సీతారామ సాగర్, డిండీ, సింగూరు కాల్వ పనులపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఉత్తమ్ మాట్లాడుతూ కాళేశ్వరం బ్యారేజీల అక్రమాలు, మరమ్మతులపైన విజిలెన్స్, న్యాయ కమిషన్, డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికల ప్రకారం చర్యలు
తీసుకుంటామన్నారు. డిజైన్, క్వాలిటీ లోపాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పరీక్షలు పూర్తయ్యాక సీడబ్ల్యూసీ ఆమోదంతో పనులు ప్రారంభిసామని తెలిపారు. మరమ్మత్తు ఖర్చు కాంట్రాక్టర్ల ద్వారానే భరింపజేస్తాం అని స్పష్టం చేశారు. ప్రతి ప్రాజెక్ట్‌లో పారదర్శకత, సాంకేతిక సమగ్రతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో ప్రజల డబ్బు ఉందని, బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పనులు కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు.
మంత్రి ఉత్తమ్ తో రైతు కమిషన్ భేటీ
రాష్ట్ర సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ బృందం సమావేశమయ్యింది. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులు పడ్తున్న ఇబ్బందులను కమిషన్ చైర్మన్ కొదండరెడ్డి, సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డిలు మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లారు. కొనుగోలు సెంటర్ల వద్ద రైతులకు పక్కా రసీదులు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడ్తున్నట్లు వివరించారు. ఇక తూకం వేసిన ధాన్యాన్ని లారీల ద్వారా రైస్ మిల్లులకు పంపిస్తున్నారని…అయితే రైస్ మిల్లుల్లో ధాన్యం దించే వరకు రైతులను బాధ్యులుగా చేయడం సరైంది కాదన్నారు. చాలా ప్రాంతాల నుండి రైతులు ఈ విషయంపై రైతు కమిషన్ కు ఫిర్యాదులు చేసినట్లుగా మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లడంతో.. వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు ఫోన్ చేసి ఇలాంటివి మరో సారి జరగకుండా చూసుకోవాలని ఆదేశాలిచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా రైతులకు కనీస వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు.
