అక్రమ ఆస్తులు నిరూపించు.. ప్రేమసాగర్ రావుకు ఎమ్మెల్యే దివాకర్ రావు సవాల్

  • Publish Date - October 21, 2023 / 11:06 AM IST

  • లేనిచో మంచిర్యాల చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలి
  • ప్రేమసాగర్ రావుది అప్పులు ఎగ్గొట్టే నైజం
  • మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు


విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ‘తనకు లేని ఆస్తులను ఉన్నట్లు ప్రజలను నమ్మిస్తున్నారు. వాటికి ఆధారాలు చూపించాలి. దమ్ము, ధైర్యం ఉంటే ఆరోపణలు నిరూపించాలి. లేనిపక్షంలో మంచిర్యాల నడి చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలి’ అంటూ మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమసాగర్ రావుకు ఎమ్మెల్యే దివాకర్ రావు సవాల్ విసిరారు. మంచిర్యాల జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.


ఓటమి భయంతో మాజీ ఎమ్మెల్సీ, మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమసాగర్ రావు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు. రౌడీయిజం, గుండాయిజానికి కేరాఫ్ అడ్రస్ ప్రేమసాగర్ రావు అని ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీలోని వారి దగ్గరే అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన నైజం ఆయనదన్నారు. బ్యాంకుల వద్ద అప్పులు తీసుకొని, వందల కోట్టు ఎగ్గొట్టేశాడని ఆరోపించారు. ఇప్పటికైనా అక్రమంగా అప్పుల పేరుతో, టికెట్ల పేరుతో తీసుకున్న డబ్బులు ఇస్తానని చెప్పగలవా? అని నిలదీశారు.


హైదరాబాద్ లోని చిరాన్ పోర్ట్ క్లబ్ లో పేకాట నిర్వహించి యువతను బానిసలు చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన చరిత్ర ప్రేమసాగర్ రావుది అని విమర్శించారు. చీమకు కూడా హాని చేయని తనపై రౌడీయిజం, గుండాయిజం అంటూ ఆరోపణలు చేసినా జనం నమ్మరని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Latest News