రైతులకు భరోసానిచ్చేందుకే కేసీఆర్ పర్యటన

సాగునీటి కొరతతో పంటలు ఎండిపోయిన రైతాంగానికి భరోసానిచ్చేందుకు బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నదాతల వద్ధకు వస్తున్నారని మాజీ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి తెలిపారు.

  • Publish Date - March 30, 2024 / 06:45 AM IST

సాగునీటి కొరతతో పంటలు ఎండిపోయిన రైతాంగానికి భరోసానిచ్చేందుకు బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నదాతల వద్ధకు వస్తున్నారని మాజీ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి తెలిపారు.

రైతుల కష్టాలు చూడలేకనే సార్ రంగంలోకి

మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి

విధాత, హైదరాబాద్‌ : సాగునీటి కొరతతో పంటలు ఎండిపోయిన రైతాంగానికి భరోసానిచ్చి సహాయక చర్యలు చేపట్టాల్సిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు ముఖం చాటేయడంతోనే రైతులకు భరోసానిచ్చేందుకు ఆరోగ్యం బాగా లేకున్నా రైతుల కష్టాలు చూడలేక బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నదాతల వద్ధకు వస్తున్నారని మాజీ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి తెలిపారు.

నల్లగొండలో ఆయన విలేఖరులతో మాట్లాడుతు కేసీఆర్ నల్లగొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల పర్యటనల వివరాలను వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలనపై సోయి లేదని, ఇప్పటివరకు వ్యవసాయంపై సమీక్ష లేదని, ఒక్క మంత్రి కూడా సమీక్ష చేయలేదని విమర్శించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ అధికారంలో ఉండి ఉంటే భూమి ఆకాశం ఒక్కటి చేసైనా సరే అన్నదాతలకు నీళ్లు అందించే వారన్నారు.

దురదృష్టం ఇవ్వాళ దరిద్రమైన ప్రభుత్వం ఉన్నదని, రాష్ట్రంలో నీళ్లు అందక లక్షల ఎకరాలు ఎండిపోయాయని పేర్కోన్నారు. రైతులు మొర పెట్టుకున్నా ప్రభుత్వంలో కదలిక లేదని, నీళ్లు ఇచ్చే అవకాశం వున్నా ఇవ్వలేదని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అన్నదాతలు ఆగం అయ్యారని, కేసీఆర్ పై కోపంతో కాంగ్రెస్ పాలకులు రైతులను బలి పెట్టారని ఆరోపించారు. సాగర్ లో డెడ్ స్టోరేజ్‌లో నీళ్లు వున్నాతమ ప్రభుత్వం అప్పుడు నీళ్లు అందించి.. అన్నదాతలను కాపాడుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కష్టాలపై పట్టించుకునే నాధుడే లేడన్నారు.

ఎస్సారెస్పీ కింద సూర్యపేట జిల్లాలో నీళ్లు ఇస్తాం పంటలు సాగు చేయండి అని చెప్పి మరి ప్రభుత్వం మోసం చేసిందని, నీళ్లు ఇవ్వక ఎక్కడికక్కడ ఎండిపోయాయని చెప్పారు. జిల్లా మంత్రులు అక్రమ వసూళ్లు ,దందాలు మొదలుపెట్టారని, మిల్లర్లను బెదిరింపు చేసి కోట్లు వసూలు చేశారని, మిల్లర్లు ఏమో అన్నదాతలను పీక్కోని తింటున్నారని ఆరోపించారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి ఓ బడ్డార్‌ఖాన్.. ఓ జోకర్.. ఆయన మాటలకు ఎక్కడ విలువ లేదని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ పర్యటన షెడ్యూల్

కేసీఆర్ ఆదివారం ఉదయం ఉదయం 9 గంటలకు బయలుదేరి వయా భువనగిరి మీదుగా జనగామ వెళ్తారని, మొదట దేవరుప్పుల లో ఎండిన పంటలను పరిశీలిస్తారని, ఆ తర్వాత సూర్యపేట జిల్లాలోని అర్వపల్లి ,తుంగతుర్తి మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారని తెలిపారు. ఆ తర్వాత సూర్యపేట పట్టణంలోని జనగామ రోడ్‌లో పంటలను పరిశీలిస్తారని, ఆ తర్వాత సూర్యపేట లో ప్రెస్ మిట్ నిర్వహిస్తారని చెప్పారు.

అక్కడి నుంచి హాలియా, మిర్యాలగూడ రోడ్ పక్కన ఉన్న సాగర్ ఆయకట్టులో ఎండిన పొలాలను పరిశీలించి అటు నుంచి హైదరాబాద్ వెళ్తారని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, నల్లగొండ బీఆరెస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి సహా మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Latest News