MLC Balmuri Venkat | యువతపై కేటీఆర్ కపట ప్రేమ

బీఆరెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌పైన, తనపైన చేసిన విమర్శలకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఘాటుగా కౌంటర్ వేశారు.

  • Publish Date - April 19, 2024 / 03:32 PM IST

పేపర్ల లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు
కేటీఆర్‌కు ఎమ్మెల్సీ బల్మూరి కౌంటర్

విధాత : బీఆరెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌పైన, తనపైన చేసిన విమర్శలకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఘాటుగా కౌంటర్ వేశారు. తెలంగాణ ఏర్పడ్డాక మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ సమాజానికి ఒరగబెట్టింది ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు ఇంట్లో కుర్చోబెట్టాక తెలంగాణ యువత గుర్తుకు వచ్చిందా? గత పదేళ్లుగా గుర్తుకు రాలేదా? అని నిలదీశారు.

అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి అయినా వాళ్లని కలిసిన పాపాన పోలేదని.. ఇప్పుడు కేటీఆర్ ఎగిరి గంతేస్తున్నారని, యువతపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు. బీఆరెస్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో విద్యార్థులు, యువతకు సంబంధించిన అంశం ఒక్కటి అయినా ఉందా? అని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం అనే నినాదంతో 2014లో అధికారంలోకి వచ్చారని, గత పదేళ్ళలో ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని.. కానీ మీ ఇంటి నిండా ఉద్యోగాలే అని బల్మూర్ వెంకట్ ఎద్దేవా చేశారు.

బీఆరెస్ ఇచ్చిన ప్రతీ నోటిఫికేషన్‌లో చిక్కు ముడులేనని, తాను వేసినవి తప్పుడు కేసులు అయితే, న్యాయస్థానం ఎందుకు ఆ నోటిఫికేషన్‌లను రద్దు చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పుడు కేటీఆర్ ఎవ్వరినీ తప్పు పడుతున్నారు? తననా లేక న్యాయస్థానాన్నినా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పదవిలో ఉండి ఏం మాట్లాడుతున్నారో కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. పేపర్ లీకేజీకీ కేటీఆర్ ఏమంటారు? వాటికి కూడా తానే కారణం అంటారా? లీకుల గురించి నోరు మెదిపితే ఎక్కడ మీ బాగోతం బయట పడుతుందోనని తెలివిగా లీకేజీ ప్రస్తావన తీయట్లేదని బల్మూర్ వెంకట్ విమర్శించారు.

ఎండల వేడి వల్ల ఆగం అవుతున్నావ్‌, నువ్వు ఏసీ ఫుల్ పెట్టుకొని ఇంట్లో బజ్జో కేటీఆర్! అని బల్మూరి వెంకట్ వ్యంగ్యాంస్త్రాలు విసిరారు. కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతీ హామికి కట్టుబడి ఉన్నామని, ఇదీ ప్రజా ప్రభుత్వమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఇప్పటికీ ఎప్పటికీ యువతకు అందుబాటులోనే ఉన్నారని.. ఉంటారని స్పష్టం చేశారు. మునుపటి లాగా ప్రగతి భవన్‌లో కంచెలు వేసే రోజులు పోయాయన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని, తెలంగాణ ఉసురు పోసుకుంది మీ కుటుంబమేనని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల వరకూ బీఆరెస్‌ పార్టీ ఉంటదా? అనే సందేహం అందరికీ కలుగుతోందని.. తానెప్పుడూ.. ఎప్పడి లాగానే నిరుద్యోగులను కలుస్తూ.. ఫోన్లో మాట్లాడుతున్నానని వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని బల్మూర్ వెంకట్ అన్నారు. మీలా నమ్మించి గొంతు కోసే రకం కాదన్నారు. అసలు కేసీఆర్, కేటీఆర్‌కు తెలంగాణ యువత గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. తెలంగాణ యువత సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రభుత్వం నిబద్ధతతో ఉందని, తెలంగాణ యువత భవిష్యత్తుకు తమ ప్రభుత్వం గ్యారంటీ అని బల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు.

Latest News