Montha Toofan | హైదరాబాద్ : తెలంగాణ( Telangana )పై మొంథా తుపాను( Montha Toofan ) ప్రభావం చూపించనుంది. బంగాళాఖాతం( Bay of Bengal ) నుంచి ముంచుకొస్తున్న ఈ మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
మంగళవారం నాడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
బుధవారం నాడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఈ జిల్లాల్లో 5 నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించింది.
