Congress MP Sudha Ramakrishan | విధాత : దేశంలో రెండు చోరీ ఘటనలు వైరల్ గా మారాయి. వాటిలో దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళా ఎంపీ మెడలోని గొలుసు చోరీ ఘటన కాగా..మరొకటి తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సెల్ ఫోన్ చోరీ ఘటన కావడం గమనార్హం. కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సెల్ ఫోన్ ను సందట్లో సడేమియా అన్నట్లుగా ఎవరో కొట్టేశారు. కొద్ధిసేపటికి తిరుగు ప్రయాణంలో వాహనంలో వెలుతున్న క్రమంలో తన ఫోన్ మిస్ అయిన సంగతిని గ్రహించిన మంత్రి తుమ్మల ఫోన్ ఎక్కడపోయిందో కనిపెట్టాలంటూ వ్యక్తిగత సిబ్బందిని.. పోలీసులను పురమాయించారు. దీంతో ఆగమేఘాల మీద విచారణ సాగించిన పోలీసులు గంట వ్యవధిలో లొకేషన్ ఆధారంగా చోరీకి గురైన మంత్రి తుమ్మల సెల్ ఫోన్ ను కనిపెట్టారు. ఓ మహిళ వద్ద ఫోన్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను విచారించి..ఫోన్ స్వాధీనం చేసుకుని తిరిగి మంత్రికి అప్పగించారు.
ఇక ఢిల్లీ చాణక్యపురిలో వీధుల్లో మార్నింగ్ వాక్ చేస్తున్న కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యురాలు సుధా రామకృష్ణన్ మెడలోని చైన్ చైన్ స్నాచర్స్ కొట్టేశాడు. ఈ ఘటనపై ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ తన ఫిర్యాదులో తెలిపిన వివరాల మేరకు తమిళనాడులోని మయిలాదుతురై పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ సుధా రామకృష్ణన్ ..తన రాష్ట్రానికి చెందిన డీఎంకే నాయకురాలు రజతితో కలిసి చాణక్యపురిలోని పోలండ్ ఎంబసీ సమీపంలో సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుంది. ఆ సమయంలో హెల్మెట్ పెట్టుకున్న ఓ వ్యక్తి స్కూటీపై ఎదురుగా వచ్చి వారి సమీపానికి రాగానే మెడలోని గొలుసు లాక్కొని పారిపోయాడు. అతడు బలంగా గొలుసు లాగడంతో ఎంపీ మెడపై గాయలవ్వగా..ఆమె డ్రెస్ కూడా కొద్దిమేర చినిగింది. వెంటనే ఎంపీ సుధా సహాయం కోసం కేకలు వేసినప్పటికి అప్పటికే దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. కొద్ధిసేపటికి ఆ ప్రాంతానికి పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ రావడంతో వారికి చోరీ ఘటనపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతుండటంతో సుధా రామకృష్ణన్ ఢిల్లీలో ఉన్నారు. చోరీ సంఘటన జరిగిన చాణక్యపురిలోనే పలు దేశాల దౌత్య కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారిక భవనాలు ఉండటం గమనార్హం.