ఫోన్ ట్యాపింగ్‌లో ఇద్దరు నల్లగొండ కానిస్టేబుల్స్ విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో నల్లగొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అప్పటి ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి

  • Publish Date - April 5, 2024 / 08:14 AM IST

  • మునుగోడు ఉప ఎన్నిక ట్యాపింగ్‌పై ఆరా
  • ఆధారాల ధ్వంసంపై ఎస్‌ఐబీ కార్యాలయ సిబ్బంది విచారణ
  • అస్వస్థతకు గురైన రాధాకిషన్‌రావు
  • విధాత : ఫోన్ ట్యాపింగ్ కేసులో నల్లగొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అప్పటి ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్‌తో పాటు పలువురు విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఇప్పటికే అరెస్టయిన ప్రణీత్‌రావు సహా ఇతర అధికారులు విచారణలో వెల్లడించారు. వారికి నల్లగొండ జిల్లాలో సహకరించిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులో సర్వర్ రూమ్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఆ కానిస్టేబుల్స్‌తో పాటు వారికి ట్యాపింగ్‌లో భాగస్వామ్యమైన అధికారులు ఎవరన్నదానిపై విచారణ బృందం ఆరా తీస్తుంది.

    ఎస్‌ఐబీ సిబ్బంది విచారణ

    ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్‌ఐబీలో ఆధారాలు ధ్వంసం చేసిన ఎలక్ట్రిషియన్, హోంగార్డులను విడివిడిగా పోలీసులు విచారించారు. ఆధారాలను ధ్వంసం చేయడానికి ఎంత డబ్బు ఇచ్చారని, జనవరి 4వ తేదీన ఎస్ఐబీలోకి రమ్మని ఎవరు పిలిచారని, ఆ టైంలో సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా?. అసలు ఎస్ఐబీ కార్యాలయంలోకి కట్టర్లతో ఎలా వెళ్లారన్న ప్రశ్నలకు వారి నుంచి వివరాలు రాబట్టారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన హార్డ్ డిస్క్‌లను, ఇతర డివైజ్‌లను పగలు ధ్వంసం చేశారా? రాత్రివేళ ధ్వంసం చేశారా..ఏ ప్రాంతంలో ధ్వంసం చేశారన్న ప్రశ్నలకు వారి నుంచి సమాధానాలు తెలుసుకున్నారు. ఈ కేసులో ధ్వంసం అయిన పరికరాలు దొరక్కపోతే కోర్టు కేసు కొట్టేసే అవకాశం ఉందని, అందుకే ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు వృథా కాకుండా పక్కా శాస్త్రీయ ఆధారాల సేకరణలో దర్యాప్తు బృందం దృష్టి పెట్టింది.

    రాధాకిషన్‌కు అస్వస్థత

    ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న ఏ4 నిందితుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అస్వస్థతకు గురయ్యారు. విచారణ బృందం అధికారులు ప్రత్యేక వైద్యులను పిలిపించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఈ నెల 10వరకు ఏడు రోజుల కస్టడీలో విచారణ ఎదుర్కోననున్నారు.

    రాధాకిషన్ రావుపై కూకట్‌పల్లి పోలీసుల షాక్‌

    ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి కస్టడీలో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు కూకట్‌పల్లి పోలీసులు మరో కేసు పెట్టి ఆయనను అరెస్టు చేసేందుకు ఎదురుచూస్తున్నారు. తనను బెదిరించి తన ఫ్లాట్‌ను ఇతరుల పేరు మీద మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిజిస్ట్రేషన్ చేయించాడంటు బాధితుడు సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనను ఏ1గా చేర్చారు. నేను చెప్పినట్టు నీవు వినాలని లేదంటే నీ భాగస్వాములు నిన్ను చంపేస్తారని, నేను చెప్పినట్టు వినకపోతే కరోనా అంటించి చంపేస్తానని, ఈ రాష్ట్రంలో నేనే పోలీస్ బాస్ అని, నీవు ఏ పోలీస్‌కు చెప్పుకుంటావో చెప్పుకో అంటూ రాధాకిషన్ రావు తనను బెదిరింపులకు గురి చేశాడని, పలుసార్లు చేయికూడా చేసుకున్నాడని సుదర్శన్ వెల్లడించాడు. తనను రెండు సంవత్సరాల పాటు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టకుండా చేశాడని బాధితుడు వాపోయాడు. పోన్ ట్యాపింగ్ కేసులో రాధా కిషన్ రావు అరెస్ట్ అయ్యాడనే విషయం తెలుసుకుని ఇప్పుడు ధైర్యంగా బయటికి వచ్చి కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని సుదర్శన్‌ తెలిపాడు. ట్యాపింగ్ కేసులో కస్టడీ ముగియ్యగానే కూకట్‌పల్లి పోలీసులు రాధాకిషన్‌రావును ఈ కేసులో అరెస్టు చేసేందుకు సిద్ధమవుతుండటం ఆసక్తికరం.

    Latest News