Site icon vidhaatha

ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్తుతో 2600 కోట్లు నష్టం.. విద్యుత్‌ జేఏసీ చైర్మన్‌ రఘు వెల్లడి

విధాత : కేసీఆర్ ప్రభుత్వ హయంలో విద్యుత్తు కొనుగోళ్ల కారణంగా రాష్ట్రానికి 2,600 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని విద్యుత్తు జేఏసీ చైర్మన్ రఘు చెప్పారు. బీఆరెస్ హయాంలో విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మంగళవారం విచారణ కొనసాగించింది. విద్యుత్తు జేఏసీ చైర్మన్‌ రఘు, ప్రొఫెసర్ కోదండరామ్‌ ఈ విచారణకు హాజరయ్యారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను కమిషన్‌కు రఘు అందజేశారు. కమిషన్ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందాలు, భద్రాద్రి, యాద్రాద్రి అంశాలపై తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందేశామని తెలిపారు. కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం ఎంవోయూ మార్గంలో కాకుండా.. కాంపిటేటివ్ రూటుకు ఎందుకు వెళ్లారన్న విషయంలో సమాచారం ఇచ్చామన్నారు. ఒప్పందం ప్రకారం ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్తు సరఫరా చేయలేదని విమర్శించారు. 1000 మెగావాట్ల సరఫరాకు ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందాలు జరిగితే అది సరఫరా చేయలేదన్నారు. తర్వాత మరో 1000 అదనపు వెయ్యి మెగావాట్లకు ఒప్పందం చేసుకున్నారని, జరిగిన తప్పు తెలుసుకొని రద్దు చేసుకోవాలంటే కుదరలేదని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుందని, ఛత్తీస్‌గఢ్‌ డిస్కంలతో రాష్ట్ర డిస్కంలు పీపీఏ చేసుకున్నాయని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ చేసుకున్న పీపీఏలకు ఇంతవరకు రెగ్యులేటరీ కమిషన్‌ ఆమోదం లభించలేదని గుర్తు చేశారు.

ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందం వల్ల మూడు రకాల నష్టాలు జరిగాయని ఆరోపించారు. విద్యుత్తు సరఫరా చేయనందుకు 635 కోట్ల నష్టం వచ్చిందన్నారు. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణల్లో, నిర్మాణ కాంట్రాక్టులలో లోపాలున్నాయని రఘు వెల్లడించారు. కాంపిటేటివ్ బిడ్డింగ్‌కు వెళ్లకుండా నామినేషన్ పద్ధతిలో నిర్మాణ ఒప్పందాలు చేసుకున్నారని, కాంపిటేటివ్ బిడ్డింగ్‌కు వెళ్లి ఉండే ధరలు తగ్గేవన్నారు. బీహెచ్‌ఈఎల్‌ కాంపిటేటివ్ బిడ్డింగ్‌పై కాగ్ స్పష్టమైన రిపోర్టు ఇచ్చిందన్నారు. భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ రాష్ట్ర ప్రభుత్వం చాయిస్ కాదని, బలవంతంగా సబ్‌క్రిటికల్ టెక్నాలజీ వాడారని విమర్శించారు. 2010లో తయారు చేసుకున్న సబ్ క్రిటికల్ యంత్రాలను, టెక్నాలజీని ప్రభుత్వంపై ఆరేళ్ల తర్వాత బీహెచ్ఎల్ బలవంతంగా రుద్దిందన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం వాడిన యంత్రాలు సరైనవి కావని తెలిపారు. గోదావరిలో వరదలు వచ్చిన ప్రతీసారి భద్రాద్రి ప్లాంట్ మునిగిపోతుందన్నారు. సాంకేతికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా భద్రాద్రి నిర్మాణం చేయడమే కాకుండా సరైన లొకేషన్ కూడా అది కాదని చెప్పారు. బొగ్గు గనులకు 280 కిలోమీటర్ల దూరంగా నిర్మించిన యాద్రాద్రి పవర్‌ ప్లాంట్ లొకేషన్ వల్ల రవాణా చార్జీల భారం ఎక్కువగా పడుతుందని రఘు తెలిపారు. పర్యావరణ అంశాలను లెక్క చెయ్యకుండా భద్రాద్రి నిర్మాణం మొదలు పెట్టారని విమర్శించారు. ఒక్క రవాణా నష్టం భద్రాద్రి ప్లాంట్ వల్ల 25 ఏళ్లలో 9వేలు, యాదాద్రి వల్ల 1600 కోట్లకు పైగా జరుగుతుందన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా భద్రాద్రి ప్లాంట్ మొదలు పెట్టారని రఘు తెలిపారు. 2016లోనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి, రెగ్యులేటరీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

తప్పుడు నిర్ణయాలను సమర్ధించుకునేందుకు కేసీఆర్‌ యత్నం: కోదండరామ్‌
అప్పటి ప్రభుత్వంలో విద్యుత్తు కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణాలలో జరిగిన తప్పులను సమర్థించుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్తు సంస్థలను రూ.81 వేల కోట్లు అప్పులపాలు చేసిందని ఆరోపించారు. రాష్ట్రానికి విద్యుత్తు కొరత నివారించే ముసుగులో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలతో వేలకోట్ల నష్టం జరిగిందన్నారు. కేసీఆర్ అనుసరిస్తున్న పద్ధతి సరైంది కాదని, ఇప్పటికీ తప్పులను సమర్ధించుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విచారణ కమిషన్ వేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవన్నారు. రెగ్యులేటరీ కమిషన్ పరిధికి వచ్చే అంశాలు లేకపోవడం, అప్పిలేట్ ట్రిబ్యునల్‌ పరిధిలో లేకపోవడంతో ప్రభుత్వం పవర్ కమిషన్ వేసిందన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో చాలా అవతవకలున్నాయన్నారు.

టెండర్ల ప్రక్రియలో, నిర్మాణ సాంకేతికతలో ప్రభుత్వం తప్పులు చేసిందని విమర్శించారు. భద్రాద్రి ఫ్లాంట్ పోలవరం పూర్తయితే గోదావరి వరదల ముంపును ఎదుర్కొంటుందని, యాదాద్రికి బొగ్గు రవాణ అదనపు భారమవుతుందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం సహజ న్యాయ సూత్రాలు, రాజ్యాంగ నీతిని ఉల్లంఘించిందన్నారు. కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో కొద్ది మందికి లాభంగా ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు లాభం జరిగిందని, కానీ ప్రజలకు తీవ్రంగా నష్టం జరిగిందని చెప్పారు. అక్కరకురాని టెక్నాలజీని తెలంగాణపై రుద్దారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగ నీతిని తుంగలో తొక్కిందన్నారు. అందుకే ఇలాంటి తప్పిదాలకు క్రిమినల్ చర్యలకు వెనుకాడకూడదని ప్రభుత్వానికి సూచించారు. పాలకులు చట్టబద్ధమైన పాలన అందించాలని కోరారు. ప్రభుత్వం అనేది ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలన్నారు. అమరుల త్యాగాలతో రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని గుర్తుచేశారు. విద్యుత్తు కొనుగోళ్లలో జరిగిన తప్పులు జరిగినప్పుడు సరిచేసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని కమిషన్‌ను కోరినట్టు కోదండరాం తెలిపారు.

Exit mobile version