నలుగురు బీజేపీ, ముగ్గురు బీఆరెస్
ఒక్కరి చొప్పున కాంగ్రెస్, ఎంఐఎం
విధాత ప్రత్యేక ప్రతినిధి: జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కేవలం తొమ్మిది మంది సిట్టింగు ఎంపీలు మాత్రమే మరోసారి పోటీచేస్తున్నారు. రాష్ట్రంలో 17 లోకసభ స్థానాలుండగా తొమ్మిది మంది పోటీ చేస్తున్నారు. ఇందులో నలుగురు బీజేపీ నుంచి ముగ్గురు బీఆరెస్ నుంచి, ఒక్కొక్కరి చొప్పున కాంగ్రెస్, ఎంఐఎం నుంచి బరిలో ఉన్నారు. ఎనిమిది మంది సిట్టింగు ఎంపీలు వివిధ కారణాలతో ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.
బీఆరెస్ నుంచి ముగ్గురు పోటీ
2019 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 17 స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో బీఆరెస్, నాలుగు స్థానాల్లో బీజేపీ, మూడు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో ఎంఐఎం ఎంపీలు గెలుపొందారు. బీఆరెస్ నుంచి గెలుపొందిన తొమ్మిది మందిలో ఆ పార్టీ నుంచి ఈ ఎన్నికల్లో ముగ్గురు పోటీ చేస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు పోటీచేస్తుండగా జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీపాటిల్ బీజేపీ అభ్యర్ధిగా, చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు.
నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు బీజేపీలో, పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరి మళ్ళీ బీజేపీలో , వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరినప్పటికీ పోటీకి దూరంగా ఉన్నారు. నాగర్ కర్నూల్ లో మాత్రం రాములు కుమారుడు పోతుగంటి భరత్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. మెదక్ సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
బీజేపీ నుంచి నలుగురు పోటీ
బీజేపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు టికెట్ దక్కకపోవడంతో పోటీలోలేరు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు. జహీరాబాద్ బీఆరెస్ ఎంపీ బీబీపాటిల్ బీజేపీలో చేరి పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి ఒక్కరు పోటీ
కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎంపీలు గెలుపొందారు. నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజ్ గిరి నుంచి ఎనుముల రేవంత్ రెడ్డి గెలుపొందారు. ఈ ముగ్గరు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందారు. ఒకరు ముఖ్యమంత్రిగా ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. చేవెళ్ళ బీఆరెస్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ చేరి బరిలో ఉన్నారు.
ఎంఐఎం నుంచి హైదరాబాద్ ఎంపీగా గెలుపొందిన అసదుద్దీన్ ఒవైసీ మరోసారి పోటీలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆరెస్, కాంగ్రెస్ నుంచి 17 మంది అభ్యర్ధులు తొలిసారి ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తుండగా మిగిలిన వారు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీచేసిన వారున్నారు. ఈ ఎన్నికల్లో మూడు ప్రధానపార్టీలతోపాటు ఎంఐఎం నుంచి కలిపి 52 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.