Site icon vidhaatha

ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం లేకుండా చేసుకుంటున్న కాంగ్రెస్, బీఆరెస్ విలీనం దిశగా…. ఆపరేషన్ ఆకర్ష్

విధాత, హైదరాబాద్ : బండ్లు ఓడలు అవుతాయి… ఓడలు బండ్లు అవుతాయన్న సామెత అక్షరాల రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆరెస్ పార్టీలలో జరుగుతున్న పరిణామాలకు సరిగ్గా సరిపోతున్నది. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు తెలంగాణలో తనకు ఎదురు లేదన్నట్లుగా వ్యవహరించిన బీఆరెస్ నేడు తన ఉనికిని కోల్పోతుందా? అన్న సందేహంలో పడింది. నాడు అడ్రస్ లేకుండా పోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీనే నేడు అదే బీఆరెస్ ను చావుదెబ్బతీసే పనిలో పడింది. టిట్ ఫర్ టాట్ అన్న తీరుగా రాష్ట్రంలో ప్రతీకార చర్యగా తిరిగి ఇప్పడు బీఆరెస్ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని వేగవంతం చేశాడన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

దానంతో మొదలు…

ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని పార్ల మెంటు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది. అయితే ఇప్పడు ఈ పథకాన్ని జెట్ వేగంతో ముందుకు తీసుకు వెళుతున్నది. కాంగ్రెస్ పార్టీ మొదట ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో మొదలు పెట్టింది. దానం నాగేందర్ ను పార్టీలోకి తీసుకొని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దింపింది. అదే సమయంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఆ తరువాత స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకొని ఆయన కూతురు కడియం కావ్యకు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్నారు. బీఆరెస్ నుంచి టికెట్ ఇచ్చిన తరువాత కడియం కావ్య కాంగ్రెస్ లో చేరింది. అయితే కాంగ్రెస్ పెద్దలు వద్దని వారించడంతో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు వలసలను ప్రోత్సహించలేదని తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముగియడంతో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేసింది. అంతే వరుసగా మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరారు. అలాగే ఎమ్మెల్సీలు పట్నం మహేందరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎగ్గె మల్లేషం, దండె విఠల్, భాను ప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్ రావు, దయానంద్, బస్వరాజు సారయ్యలు కాంగ్రెస్‌లో చేరారు. ఇదే దారిలో మరి కొంత మంది ఎమ్మెల్సీలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మండలిలో సైతం మెజార్టీ సాధించేదాకా, చైర్మన్‌పై అవిశ్వాసం రాకుండా ఎమ్మెల్సీల చేరికలను కాంగ్రెస్ ప్రొత్సహిస్తుంది. కాగా మరో నలుగురు ఎమ్మెల్యేలు ఆదివారం నాడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.

కూల్చివేత కుట్రలకు అవకాశం లేకుండా

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలుచుకున్నది. సీపీఐ గెలిచిన స్థానంతో కలిసి పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు బలం 65 మాత్రమే. ఇప్పడు కంటోన్మెంట్ తో కలిపి 66కు పెరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న చర్చ జోరుగా సాగింది. దీనిని బలపరిచే విధంగా బీజేపీ, బీఆరెస్ నేతల మాటలు ఆనాడున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపుల కలహాలతో నిండిన పార్టీ అన్న సంగతి జగమెరిగిన సత్యం. పార్టీలో ఉన్న గ్రూపులను అడ్వాంటేజ్ గా తీసుకొని పార్టీని చీల్చి ప్రభుత్వాన్ని కూల్చే ప్రమాదం ఉందని గుర్తించిన రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారన్న చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే బీజేపీ, బీఆరెస్ అగ్రనేతల కుట్రలకు ,ఆలోచనలకు అందని తీరుగా రేవంత్ రెడ్డి వలసలను ప్రోత్సహించాడంటున్నారు. ఈ వలసల పరంపర బీఆరెస్‌ఎల్పీ విలీనమయ్యేంత వరకు కొనసాగుతుందని కాంగ్రెస్ వాదులు అంటున్నారు. అంటే ఇప్పటికే చేరిన 7గురు ఎమ్మెల్యేలతో పాటు మరో 19మంది ఎమ్మెల్యేలను చేర్చుకునే దాకా బీఆరెస్ నుంచి వలసలకు కాంగ్రెస్ గేట్లు ఎత్తిపెట్టనున్నారు.

కేసీఆర్ దారిలోనే..

తెలంగాణ ఏర్పాటు తరువాత అధికారంలోకి వచ్చిన బీఆరెస్ రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలు లేకుండా చేయాలన్న దిశగా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. మొదట టీడీఎల్పీని విలీనం చేసుకున్నారు. సీపీఐకి ఉన్న ఒక్క ఎమ్మెల్యేను తన పార్టీలో చేర్చుకొని సీపీఐకి సభలో ప్రాతినిధ్యం లేకుండా చేశారు. ఆ తరువాత 2018 ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్న నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని చావుదెబ్బతీశాననిపించారు. సీఎల్పీని బీఆరెస్‌ఎల్పీలో విలీనం చేసుకున్నారు. అసెంబ్లీ లాబీలో కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత చాంబర్ కూడా లేకుండా చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి వాయిస్ లేకుండా చేశారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడి బీఆరెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే వెంటనే సస్పెండ్ చేసే వారు. ఇలా ప్రతిపక్ష పార్టీపైన కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. బీఆరెస్ దెబ్బకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్న భావన ఆనాడు సర్వత్రా ఏర్పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు లేవు… తన అధికారానికి ఎదురు లేదన్న తీరుగా వ్యవహరించారు. తీరా 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆరెస్ ను ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కేసీఆర్ చేతిలో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు అధికారంలో కూర్చోబెట్టారు. అయితే మెజార్టీ బొటాబొటిగా ఉండడంతో తిరిగి కాంగ్రెస్ ను చీల్చి ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ, బీఆరెస్ లు కుట్రలు చేస్తున్నాయని భావిస్తున్న కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలు పెట్టింది. ఇలా నాడు బీఆరెస్ కాంగ్రెస్ పట్ల అనుసరించిన తీరునే ఇప్పుడు తన అధికారాన్ని కాపాడు కోవడానికి కాంగ్రెస్ మొదలు పెట్టి కొనసాగిస్తోంది.

Exit mobile version