Palamuru Lift | పడకేసిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు

Palamuru Lift | కరువు సీమ ప్రాంతంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నిలిచిపోనుందా... ఇక్కడి సాగు భూములు ఎడారిగా మారనున్నాయా... తాగునీటి కి తంటాలు తప్పవా...పాలమూరు కష్ట జీవులకు మళ్ళీ వలస బతుకులు తప్పవా... తట్టా బుట్టా సర్దుకొని పోవాల్సిందేనా.. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తోంది.

పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
ఎక్కడిక్కడే నిలిచి పోయిన పనులు
పెండింగ్ లోనే కాలువలు, జలాశయాల నిర్మాణం
పంప్ హౌస్‌లో పూర్తి కానీ మోటార్ల బిగింపు
పాలమూరు కరువు సీమగా ఉండిపోవాల్సిందేనా?
నోరెత్తని జిల్లా మంత్రులు , ఎమ్మెల్యేలు, నేతలు!

Palamuru Lift | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : కరువు సీమ ప్రాంతంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నిలిచిపోనుందా… ఇక్కడి సాగు భూములు ఎడారిగా మారనున్నాయా… తాగునీటి కి తంటాలు తప్పవా…పాలమూరు కష్ట జీవులకు మళ్ళీ వలస బతుకులు తప్పవా… తట్టా బుట్టా సర్దుకొని పోవాల్సిందేనా.. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తోంది. నేతల నిర్లక్ష్యం, అలసత్వంతో జిల్లాలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అందుకు పాలమూరు,రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టు ఉదాహరణ. పదేళ్లు గడిచినా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ఐదేళ్ల లో పూర్తి కావలసిన ప్రాజెక్టు పనులు పదేళ్ల పాటు సాగుతూనే ఉన్నాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన లో ఈ ప్రాజెక్టు పై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో నేటికీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హడావిడి గా ఒక్క మోటారు ఆన్ చేసి ప్రాజెక్టు అంతా పూర్తి చేసినట్లు వ్యవహరించారు. ఆ ఒకే రోజు మోటారు ఆన్ చేసిన అధికారులు ఇప్పటి వరకు మళ్ళీ ఆన్ చేయలేదు. పనులు కాక ముందే కేసీఆర్ కోసం ఒకే ఒక మోటారును సిద్ధం చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడం… కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడంతో ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయానే ఉద్దేశ్యం రైతుల్లో కనపడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఇక్కడి రైతుల కళ్లల్లో ఆనందం తొణికిసలాడింది. ప్రజా పాలన అంటూ అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్ ఈ ప్రాజెక్టు ను సందర్శించి సత్వరమే ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా నేటికీ ప్రాజెక్టు పనుల వైపు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెతైనా చూడడం లేదు. జిల్లా కు చెందిన ముఖ్యమంత్రి కూడా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చ్రసి రైతులకు సాగునీరు అందిచ్చేందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు మొదలై పదేళ్లు గడుస్తున్నా…. ప్రభుత్వం మారినా ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని రైతాంగం కోరుతున్నారు.

ఇదీ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు చరిత్ర

తెలంగాణ వరదాయనిగా, పాలమూరు వంటి కరువు జిల్లాతో పాటు మారి కొన్ని జిల్లా లకు సాగు నీటిని పారించే ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, రంగారెడ్డి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పునాది రాయి వేశారు. ఈ ప్రాజెక్టు 1,200 గ్రామాలకు తాగునీరు, 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇంతటి బృహత్తర ప్రాజెక్టు పనులు పెండింగ్ లో పడ్డాయి. ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నది ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. కానీ ఆ కృష్ణా నదిని ఆనుకుని ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలలో కరవు, ఫ్లోరైడ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ రెండు ప్రాజెక్టులు ఆంధ్ర, తెలంగాణ మధ్య ఉమ్మడిగా ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల వెనుక జలాశయాల్లో చేరిన నీటిని తమ ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు ఆంధ్రకు కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. తెలంగాణలో అటువంటి పెద్ద ఏర్పాట్లేమీ లేవు. కృష్ణా నది కంటే తెలంగాణ గట్టు ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల సహజంగా నీరు పారే అవకాశమూ లేదు. దీంతో దక్షిణ తెలంగాణ సమస్యను తీర్చడానికి కృష్ణా నదిలో మిగులు, వరద నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోసి నిల్వ చేసుకుని ఏడాది మొత్తం అవసరాలకు వాడుకోవాలనే ఉద్దేశంతో మొదలైన ప్రాజెక్టు ఈ ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. ఇప్పుడు శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ ను కాలువ ద్వారా నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్ అనే గ్రామం దగ్గర నిర్మించిన పంపు హౌసుకు మళ్లిస్తారు. అక్కడి నుంచి నీటిని ఎత్తి అక్కడే నిర్మించిన రిజర్వాయరులోకి పంపిస్తారు.ఇక్కడి నుంచి ఎదుల జలాశయానికి మోటార్ల తో పంపింగ్ చేస్తారు.

నిలిచిపోయిన రిజర్వాయర్ల నిర్మాణ పనులు

మొత్తం ప్రాజెక్టులో ప్రస్తుత నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణ పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలు తాగు, సాగు నీటి ఫలాలు పొందుతాయి. రోజుకు 1.5 టీఎంసీల వరకూ నీటిని ఎత్తిపోయవచ్చు. ఈ నీటిని ఎత్తిపోసేందుకు ఐదు చోట్ల పంపు హౌసులు నిర్మించారు. దీని కోసం చేపడుతున్న ఆరు రిజర్వాయర్లు నిర్మాణాల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ఆరు జలాశయాలూ కలిపి 67.74 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకోగలవు. ఈ నీటిని ఎత్తడం కోసం అన్ని పంపు హౌసుల్లో కలిపి 34 మోటార్లు పెడుతున్నారు. వాటిలో 31 మోటార్లు ఒక్కొక్కటీ 145 మెగావాట్ల సామర్థ్యం, మూడు 75 మెగావాట్ల సామర్థ్యంతో ఉంటాయి. ఈ మోటార్లు కాళేశ్వరంలో వాడిన వాటి కంటే పెద్దవని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా 61.57 కి.మీ మేర సొరంగాలు, 915.47 కి.మీ పొడవైన కాలువలు ఉంటాయి. దీంతో ఎత్తిపోతల పథకంతో తాగు నీటికి 7.15 టీఎంసీలు, పరిశ్రమలకు 3 టీఎంసీలు, సాగునీటికి 75.94 టీఎంసీలు వాడుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం జూరాల, రాజోలిబండ, ఇతర చెరువుల ద్వారా కేవలం 2 లక్షల ఎకరాలకే నీరు అందేది. ఇక ఇక్కడ నిర్మించాలని ప్రయత్నించిన బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు లిఫ్ట్ పనులు పూర్తి కావడమే లేదు.దీంతో మహబూబ్‌నగర్ సాగు నీటి సమస్య తీర్చడం కోసం పాలమూరు, రంగారెడ్డి లిఫ్టు ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు. సరిగ్గా తెలంగాణ ఏర్పడే ముందు 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఎత్తిపోతల పథకానికి సర్వే నిమిత్తం ఒక జీవో ఇచ్చారు. అంతకుమించి ఆయన చేసిందేమి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఈ ప్రాజెక్టు ఫైల్ లో కదలిక వచ్చింది. రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే, అంటే 2014 ఆగస్టు లోనే ఈ ప్రాజెక్టు అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం మళ్లీ సర్వే చేయించింది. మొదట్లో జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయాలి అనే ప్రతిపాదనలు వచ్చాయి.

2 విభాగాలుగా ప్రాజెక్టు పనులు

చాలా కసర్తతు చేసిన తరువాత, జూరాల కాకుండా శ్రీశైలం నుంచి ఎత్తిపోయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. దాంతోపాటూ కొత్తగా ఆరు జలాశయాలు నిర్మించాలని నిర్ణయించారు. కొత్త డిజైన్ వల్ల ముంపు బాగా తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 2015 జూన్‌లోనే దీనికి శంకుస్థాపన చేశారు. 2016 జూన్‌లో రూ. 32 వేల 500 కోట్ల ఖర్చుకు అనుమతి ఇచ్చారు. ప్రాజెక్టు పనులను 2 విభాగాలుగా విభజించారు. తాగునీటి పనులు మొదటి దశ, సాగునీటి పనులు రెండో దశలో పూర్తి చేయాలనేది ఉదేశ్యం. సాంకేతికంగా ఈ ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపు లేదు. కృష్ణా నదిలో వరద వచ్చినప్పుడు వచ్చే మిగులు జలాలు వాడుకోవాలనేది ఉద్దేశం. ఈ ప్రాజెక్టు రెండో దశలో కేవలం కాలువల నిర్మాణం ఉంటుంది. ఆ కాలువల నిర్మాణం పూర్తయితేనే వాస్తవంగా సాగునీరు అందుతుంది. తాగునీటి నిమిత్తంతో పాటూ, భవిష్యత్తులో సాగునీరు తోడటానికి కావల్సిన పంపు సెట్లను మొదటి దశలో నిర్మించడం ప్రారంభించారు. కేవలం కాలువలు మాత్రమే రెండో దశలో పెట్టారు. ఈ మొదటి దశలో కూడా అన్ని రిజర్వాయర్లూ, అన్ని పంపు హౌజులూ వంద శాతం పూర్తి కాలేదు. మొదటి విడతలోని నార్లాపూర్ పంపు హౌసులో 9 మోటార్లు ఉండగా, 3 మోటార్ల డెలివరీ పాయింట్లే పూర్తయ్యాయి. అందులో కేసీఆర్ ఒక మోటార్‌ను ప్రారంభించారు. అలాగే ఇతర పంపుహౌసుల్లో పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నందునే పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభిస్తున్నారని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ప్రాజెక్టు మెయిన్ పనులు 80 శాతం వరకు పూర్తి అయ్యాయి. ఎదుల రిజర్వాయర్ వంద శాతం పూర్తయింది. వట్టెం, కరివెన రిజర్వాయర్లు 80-85 శాతాలు పూర్తయ్యాయి. ఉద్దండపూర్‌లో మాత్రం ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తంగా నీటిని ఎత్తిపొసేందుకు 34 మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. వట్టెం దగ్గర కూడా నాలుగు మోటార్లు సిద్ధం అయ్యాయి. అక్కడ సబ్ స్టేషన్ పనులు అప్పట్లో కొనసాగాయి. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో జోరుగా జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలం లో గంపెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని జిల్లా కు చెందిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే లు విమర్శలు చేస్తున్నారు. జిల్లా కు చెందిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నా ఈ ప్రాజెక్టు ను పూర్తి చేసేందుకు శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంకా కరువు సీమలాగే మిగిలిపోతున్నది. కాంగ్రెస్ నేతలు ఇకనైనా ప్రాజెక్టు పూర్తి కోసం కళ్ళు తెరవండని జిల్లా రైతులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లా లో కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు మంత్రులు, అధిక సంఖ్య లో ఎమ్మెల్యే లు ఉన్నా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు విషయం పై ఎన్నడూ తమ గళం వినిపించలేదనే విమర్శలు మూటగట్టుగున్నారు.