Chandrababu : మార్కెట్ అంచనాతో పంటల సాగుతో లాభాలు : సీఎం చంద్రబాబు

రైతులు మార్కెట్, వాతావరణాన్ని అంచనా వేసి పంటలు వేస్తే లాభాలు పెరుగుతాయని సీఎం చంద్రబాబు చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని భరోసా ఇచ్చారు.

Chandrababu Naidu

అమరావతి : రైతులు తెలివైన వారని..మార్కెట్ ను అంచనావేసి..వాతావారణ పరిస్థితులను అనుసరించి పంటలు వేయడం ద్వారా నష్టాలు తగ్గించుకుని లాభసాటి వ్యవసాయం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో రైతన్నా…మీకోసం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని రైతులతో మాట్లాడారు. చంద్రబాబుకు మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం పంట పొలాలను పరిశీలించారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. కొబ్బరి ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించి… కొబ్బరి ఎంత మేర పంట వస్తోందని ఆరా తీశారు, కోకో ఉత్పత్తులను పరిశీలించారు. నర్సరీలను అభివృద్ధి చేయాలని సూచించారు. వ్యవసాయం, హర్టీకల్చర్ లో వీలైనంత రీసెర్చ్, ఎనాలసిస్ చేపట్టాలని తెలిపారు. పామాయిల్ సాగులో టెక్నాలజీని వినియోగించేలా చూడాలని సూచించారు. నల్లజర్లలోని వ్యవసాయ యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. ప్రధాన పంటలు, అంతర పంటలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యుత్తు చార్జీలు పెంచబోం

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఏపీని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాం.. అమలు చేస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌ అయ్యిందన్నారు. పంచసూత్రాల మీద అవగాహన కల్పించేందుకే రైతన్నా… మీ కోసం పేరుతో ప్రతి రైతు ఇంటికి వెళ్లి ప్రచారం చేపట్టామన్నారు. రైతులకు సాగులో ఆదాయం రావాలని, రైతుల సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం అవసరం అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చాను… దానికి అనుగుణంగానే విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని నిర్ణయం తీసుకున్నాం అని మరోసారి స్పష్టం చేశారు. ఛార్జీలను పెంచకుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తాం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం అని తెలిపారు. రైతన్నకు అండగా ఉంటామనేది మా మొదటి నినాదం. నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. గోదావరి జలాలను కృష్ణా నదికి కలిపాం. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతాం అని, పెన్నా వరకూ తీసుకెళ్తాం అని తెలిపారు.ప్రతి ఇంటికీ పారిశ్రామిక వేత్త అనేది ప్రభుత్వ విధానం.
రైతులు కూడా వ్యవసాయాధారిత పరిశ్రమలు పెట్టుకోవాలి… ప్రభుత్వం ప్రొత్సహించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. రైతులు కూడా ఎంఎస్ఎంఈ పరిశ్రమలు నెలకొల్పాలి. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవాలి… రైతులు పారిశ్రామిక వేత్తలవ్వాలని తెలిపారు.

ఆలోచించి పంటలు వేయాలి

శాస్త్రవేత్తల చెప్పిన సూచనలను రైతులు పాటించాలని చంద్రబాబు తెలిపారు. ధరలు బాగా ఉన్నాయి కాబట్టి… అదే పంటను వేయడం కాదు… సైంటిఫిక్‌గా ఆలోచించి ఏ పంట వేయాలో ఆ పంటే వేయాలన్నారు. నేను రైతుబిడ్డనే అని.. ఒకప్పుడు వ్యవసాయం చేసేవాడిని… ఇప్పుడు పరిపాలన చేస్తున్నానన్నారు. వేరే దేశాల్లో జరిగే పరిణామాల ప్రభావం మన రైతుల మీద పడుతోందని..ట్రంప్ కు కోపం వచ్చింది… మన రొయ్యకు ఇబ్బందులు వచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటలు మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. డిమాండ్ ఉంది కదా అని అందరూ ఒకే పంటలు వేస్తే… మార్కెటింగ్ ఇబ్బందులు వస్తాయని, ధరలు పడిపోతాయన్నారు. అందుకే రకరకాల పంటలు వేయాలి… అంతర పంటలపై దృష్టి సారించాలని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని రీ-ఓరియేంటేషన్ చేస్తాం అని, యూనివర్శిటీల్లో చేస్తోన్న పరిశోధనలు రైతులకు అందుబాటులోకి రావాలన్నారు. చదువుకునే పిల్లలకు కూడా పొలాల్లో పని చేసి… వ్యవసాయం గురించి తెలుసుకునే పరిస్థితి రావాలని తెలిపారు.

Latest News