Site icon vidhaatha

పడకేసిన పాలమూరు లిఫ్ట్.. ఒక్క పంపును ప్రారంభించి చేతులు దులుపుకున్న కేసీఆర్‌

పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ పనులన్నీ పెండింగ్
ఎక్కడికక్కడే నిలిచిపోయిన పనులు
కేసీఆర్‌ సర్కార్ నిర్లక్ష్యం మే ఈ ప్రాజెక్టు కు గ్రహణం
కాంగ్రెస్ సర్కార్ అధికారం లోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ముందుకు సాగని ప్రాజెక్టు పనులు
ఈ ఎడాదైనా పనులు పూర్తి అవుతాయని రైతుల ఎదురుచూపు

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేసీఆర్‌ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను అనుకున్న సమయం లో పూర్తి చేయడం లో విఫలం చెందింది. 2015 జూన్‌లో అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టు కు శంకుస్థాపన చేశారు. ఇదేళ్ల లో ప్రాజెక్టు పనులు పూర్తి చేసి సాగు, తాగు నీరు అందిస్తానని కేసీఆర్‌ ప్రకటించారు.2023 వరకు కేసీఆర్‌ సీఎం గా ఉన్నా ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం లో విఫలమయ్యారు.

గత అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడి గా ఒక్క పంపు ప్రారంభించి ప్రాజెక్టు పనులు పూర్తి అయినట్లు కేసీఆర్‌ చెప్పిన మాటలు అంతా బోగస్ అని తేలింది. ఎక్కడి పనులు అక్కడ పెండింగ్ లో పెట్టి పనులు పూర్తి అయినట్లు ప్రకటించి ఓట్లు దండుకోవాలని చూసిన కేసీఆర్‌ ప్రయత్నం జిల్లా లో చెల్లలేదు. కేసీఆర్‌ సర్కార్ వల్లే ఈ ప్రాజెక్టు కు గ్రహణం పట్టిందని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను పక్కన పెట్టి కాంగ్రెస్ కు పట్టంకట్టారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే పెండింగ్ ప్రాజెక్టు లు పూర్తి అవుతాయనే ఉద్దెశం తో ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.

కాంగ్రెస్ సర్కార్ అధికారం లోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పై ఇంకా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి గా బాధ్యతలు చేపట్టాకా ప్రాజెక్టు పనులు వేగం పుంజుకుంటాయని అందరూ అనుకున్నారు.కానీ ఇప్పటికీ కాంగ్రెస్ సర్కార్ ఈ లిఫ్ట్ పనులను కొనసాగించడం లో ఆసక్తి కనబరుస్తలేదనే అభిప్రాయాన్ని జిల్లా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.ఇదేళ్ల పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పనులు తొమ్మిది ఏళ్ళు అయినా ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోయాయి.

ప్రాజెక్టు పుట్టుపూర్వోత్తరాలు

హైదరాబాదు కు తాగు, పారిశ్రామిక అవసరాలకు నీరు, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగు, సాగునీరు అందించే లక్ష్యం తో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం లోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తోడి రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం, లక్ష్మీదేవిపల్లి వరకు పంపిస్తారు. వర్షాకాలంలో 60 రోజుల పాటు వరద ఉండే రోజుల్లో రోజుకు 1.5 టిఎమ్‌సి చొప్పున మొత్తం 90 టిఎమ్‌సి నీటిని ఎత్తిపోయాలనేది ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది.

శ్రీశైలం జలాశయం నుంచి ఐదు అంచెల్లో ఎత్తిపోసి 670 మీటర్ల ఎత్తున ఉన్న లక్ష్మీదేవిపల్లి జలాశయానికి నీటిని చేరుస్తారు. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 5 లిఫ్టులు, 6 జలాశయాలు నిర్మిస్తున్నారు. రూ. 35,200 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు 2015 జూన్ 10 న తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మాణ పనులు చేపట్టారు. మొదటి దశలో మొత్తం నీటిని తరలించడానికి పంపుహౌసులు, జలాశయాలు, పైపులైన్లు, కాలువలు, సొరంగాలు నిర్మించి, తాగునీటి అవసరాలు , పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తారు. రెండవదశలో సాగునీటిని అందించేందుకు అవసరమైన కాలువల పనులు చేపడుతారు.

నీటి పంపింగ్ ఇలా

శ్రీశైలం జలాశయం నుంచి నీటి ని ఎత్తి పొసేందుకు నార్లపూర్ వద్ద జలాశయాన్ని నిర్మించారు. అక్కడి నుంచి కాలువ ల ద్వారా ఏదుల జలాశయం వరకు నీటిని పంపిస్తారు. ఇక్కడి నుంచి వట్టెం, కరివేన, ఉద్ధండాపూర్, రంగారెడ్డి జిల్లా లక్ష్మి దేవి పల్లి జలాశయాలకు నీటిని పంపిస్తారు. ఏదుల, వట్టెం, కరివేన జలాశయాల పనులు ఇప్పటికీ పూర్తి అయ్యాయి.కానీ వీటి వరకు నీటిని పంపించేందుకు నిర్మించే కాలువల పనులు అక్కడక్కడ పెండింగ్ లో ఉన్నాయి.

కరివేన జలాశయం నుంచి ఉద్ధండా పూర్ జలాశయం వరకు నీటిని పంపించేందుకు సుమారు తొమ్మిది కిలోమీటర్లు సొరంగం ద్వారా పంపాల్సి ఉండడం తో ఆ పనులు కూడా మధ్య లోనే నిలిచి పోయాయి.ఇవన్నీ పూర్తి అవుతే పాలమూరు జిల్లా తో పాటు మరికొన్ని జిల్లాల్లో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఇంత బ్రహత్తర ప్రాజెక్టు పనులు పెండింగ్ లోనే ఉండిపోయాయి. వర్షాకాలం సమీపిస్తున్నా ప్రాజెక్టు పనుల్లో చలనం లేకపోవడం తో ఈ ఏడు కూడా పంట పొలాలకు నీరందే పరిస్థితి కనిపించడం లేదు.

మొక్కుబడిగా ప్రారంభం

2023 సెప్టెంబరు 16న నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ కంప్యూటర్ ద్వారా స్విచ్ ఆన్ చేసి పాలమూరు – రంగా రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. నార్లాపూర్ రిజర్వాయర్‌ నుంచి ఏదుల రిజర్వాయర్‌లోకి వదిలిన కృష్ణమ్మ జలాలకు కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ రోజు ప్రారంభించిన గంట తరువాత మోటార్ల ను బంద్ చేశారు.కాలువల పనులు పూర్తి కాకపోవడంతో ప్రారంభించిన గంటకే పథకం పడకేసింది. ఎన్నికల హడావిడి కోసమే ప్రారంభించారనే ఆరోపణలు కేసీఆర్‌ ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి ఈ పథకం పనులు నిలిచి పోయాయి. మళ్ళీ ఇప్పటి వరకు పనులు చేపట్టెందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి.ఈ పథకానికి కేసీఆర్‌ అనే పట్టిన గ్రహణం నుంచి రేవంత్ రెడ్డి విడిపిస్తారనే ఆశలో రైతులు ఉన్నారు.

రైతుల ఆశలన్నీ రేవంత్ రెడ్డి పైనే

పాలమూరు రైతులు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పైనే ఆశలు పెట్టుకున్నారు. జిల్లా చెందిన వ్యక్తి రేవంత్ రెడ్డి కావడం తో జిల్లా లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు ల్లో చలనం కల్గిస్తారనే నమ్మకంతో ఇక్కడి రైతులు ఉన్నారు. పెండింగ్ లో ఉన్న పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కొనసాగించి వెంటనే పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

Exit mobile version