విధాత : తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ(panchayat election) ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1గంటకు ముగిసింది. అయితే పోలింగ్ సమయం ముగిశాక(after polling time) కూడా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు భారీగా క్యూలైన్ల(long queues)లో నిరీక్షిస్తున్నారు. అనేక గ్రామ పంచాయతీలలో ఇదే పరిస్థితి నెలకొంది.
చలికాలంతో ఉదయం పోలింగ్ మందకొడిగా సాగడం.. పట్టణాల నుంచి ఓటర్లు తమ సొంతూళ్లకు చేరుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లడంలో జరిగిన జాప్యంతో పోలింగ్ ముగిశాక కూడా ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరడానికి కారణమైంది. నిర్ణీత సమయం 1గంట కల్లా పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారికి పోలింగ్ సిబ్బంది ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.
మరోవైపు చిన్న గ్రామపంచాయతీల్లో మాత్రం పోలింగ్ సకాలంలోనే ముగిసిపోయింది. దీంతో పోలింగ్ ముగిసిన గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సిబ్బంది భోజన విరామం అనంతరం ఓట్ల లెక్కింపుకు సిద్దమవుతున్నారు. ఇదే రోజు ఫలితాలను వెల్లడించడంతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనుండటం విశేషం.
