విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న బాకీ కార్డు ప్రచారం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. మంగళవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై పలు విమర్శలు గుప్పించారు. తెలంగాణకి బీఆర్ఎస్ చేసిన బాకీకి (అప్పులకు)మేము వడ్డీలు కడుతున్నాం అన్నారు. బకాయిల గురించి మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్ అవుతారని..బీఆర్ఎస్ బాకీ కార్డు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని..ఆ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను కూడా గుర్తు చేసుకుంటున్నారని చురకలేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పల కుప్పల రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్ నాయకులకు ‘బకాయి’ అనే పదం కూడా ఎత్తే అర్హత లేదన్నారు. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఎంత మందికి బీఆర్ఎస్ హయంలో ఉద్యోగాలు ఇచ్చారు..? అని ప్రశ్నించారు. ఎంతమందికి దళిత బంధు ఇచ్చారు?..మూడెకరాల భూమి ఇచ్చారో చెప్పాలని..కేజీ టూ పీజీ ఉచిత విద్య, ముస్లీంలు, గిరిజనులకు రిజర్వేషన్లు వంటి హమీలు అమలు చేశారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేస్, పలు ప్రభుత్వ పథకాల్లో స్కాంలు చేసిన బీఆర్‌ఎస్ బండారం ఒక్కొక్కటి బయట పడుతుండడంతో దిక్కుతోచక ‘బాకీ కార్డు’ పేరుతో మోసపూరిత ప్రచారం చేస్తుందని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన నవాబు పాలన మాదిరిగా సాగి.. తెలంగాణను సర్వ నాశనం చేసిందన్నారు. తెలంగాణలో 40 లక్షల మందికి రేషన్ కార్డులు బాకీ పడ్డది మీరు కదా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
హామీల అమలు బాకీలా..?
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రూ.500 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం బకాయి పడ్డట్టా..? ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచడం బకాయి పడ్డట్టా..? నిరుద్యోగుల కలలు సాకారం చేసి ఇప్పటికే వేలాది ఉద్యోగాలివ్వడం బాకీ పడ్డట్టా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం, రైతు భరోసా ఇవ్వడం, వరికి బోనస్ ఇవ్వడం బకాయి పడ్డట్టా..? రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం బకాయి పడ్టట్టా..? అని బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం బకాయి పడటం అవుతుందా అని..? బీఆర్‌ఎస్ ప్రచారం ఎంతో లోపాభూయిష్టంగా, హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల మనసులో కాంగ్రెస్ పార్టీ ఉందని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం పైగా సీట్లు గెలుచుకుంటాం అని.. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి నష్టం చేస్తున్న బీజేపీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సహకరించకుండా నష్టం చేస్తుందని, ఎరువుల పేరిట కేంద్రంలోని బీజేపీ మోసం చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. జీఎస్టీ పేరిట వేల కోట్లు కేంద్రంలోని బీజేపీ దోచుకుందని, బీఆర్ఎస్, బీజేపీలు కలిసే సంసారం చేస్తున్నాయని..ఆ రెండు పార్టీలు ఒక్కటై కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులకు బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీని అడిగే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. బీసీ బిల్లులు గురించి ఈటల ప్రధానితో మాట్లాడారా? అని.. బీసీల నోటి కాడా ముద్ద లాక్కునే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కుల సర్వే నిర్వహించాం అని.. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం కుల సర్వేను పారదర్శకంగా నిర్వహించిందన్నారు. బీసీ రిజర్వేషన్లను ప్రశ్నించే అర్హత బీజేపీ నేతలకు లేదన్నానరు. * పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాట ఇస్తే నిలుపుకోవడం కాంగ్రెస్‌కే సాధ్యమని బీసీ రిజర్వేషన్లతో మరోసారి నిరూపితమైందన్నారు. మూసీ వరదల సందర్భంగా హైడ్రా ప్రాధాన్యత మరోసారి రుజువైందని..హైడ్రా రావాల్సిన అవసరంపై అనేక సార్లు ప్రస్తావించానన్నారు. హైడ్రా రూపకల్పన దూర దృష్టితో తీసుకున్న నిర్ణయం అని..మూసీ వరదకు ఆటకంగా మారిన ఆదిత్య కన్స్ట్రక్షన్ నిర్మాణంపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.