Rains | హైదరాబాద్ : రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి.. తెలంగాణలో వరద పరిస్థితులు, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టాన్ని సీఎం రేవంత్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను.. తీసుకున్న జాగ్రత్తలను సీఎం వివరించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానికి తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మోదీ అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు సీఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని ప్రధాని తెలిపారని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని రేవంత్ వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అమిత్ షాకు సీఎం తెలిపారు. అవసరమైన తక్షణ సాయం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో నేరుగా మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.