సంచార జాతుల అభివృద్ధికి రూ. 400 కోట్లు
మన బిడ్డలు ఆర్థిక స్థిరత్వం సాధించాలి
ఇప్పటికే పైకి వచ్చినవారు సాకారం అందించాలి
హైదరాబాద్, సెప్టెంబర్10(విధాత): సంచార జాతుల పిల్లలు ఉద్యోగాలు పొందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బుధవారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన సంచారయుక్త జాతుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. మంచి తరాన్ని నిర్మించడానికి ప్రజా ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మన జాతి బిడ్డలకు మంచి చదువులు నైపుణ్యాలు అందించాలి.. ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలన్నారు.
మన సంచార జాతుల్లో ఇప్పటికే పైకి వచ్చిన వారు ఇతరులకు సహకారం అందించి ప్రోత్సహించాలని సూచించారు. బీసీ కుల సర్వే జరిగింది.. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేశామని మంత్రి పేర్కొన్నారు. రిజర్వేషన్లు పెరగాలి..భవిష్యత్ లో న్యాయం జరగాలన్నారు. శాసన సభలో మాట్లాడిన, ప్రభుత్వంలో మాట్లాడిన సంచార జాతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
400 కోట్ల రూపాయలు సంచార జాతుల అభివృద్ధికి ప్రకటించి ఇప్పటికే 100 కోట్లు విడుదల చేయడం జరిగిందని, 100 మంది ఎంబీసీ నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. సంచార జాతులకు ఇళ్ల నిర్మాణాలు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని, సంచార జాతుల పై సర్వే జరుగుతుంది.. సర్వే ద్వారా వాస్తవ పరిస్థితులు చెప్తామని మంత్రి తెలిపారు. కుల వృత్తులు మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి జరగాలి.. ఎంత చదువుకున్న మన కుల వృత్తులు మరింత నైపుణ్యం ద్వారా ఆర్థిక స్థిర్వతం సాధించాలన్నారు.
సంచార జాతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మాది, మనమంతా ఐక్యంగా ఉండి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని కోరారు. శ్రమ తోపాటు లక్ష్యాన్ని సాధించే దిశగా వెళ్ళాలి, రాజకీయంగా సంచార జాతులు నిలదొక్కుకోవాలి.. ఉన్నత చదువులు చదవాలి, సంచార జాతుల విముక్తి దినోత్సవం భవిష్యత్ లో మరింత ఘనంగా జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ ,ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపాటి జైపాల్ , మాజీ ఐఏఎస్ చిరంజీవి , బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి , బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.