- కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
- తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం
విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: గత పది సంవత్సరాల బీజేపీ పాలనలో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని తెలంగాణ జనసేన రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం కోడండరాం అన్నారు. 70 కోట్ల మంది పేద ప్రజలు 15% శాతం మాత్రమే సంపద కలిగి ఉన్నారని చెప్పారు. ఇంత తీవ్రమైన అసమానతలు ఎన్నడూ లేవన్నారు. బుధవారం మెదక్‌కు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అనేక సంఘాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నాయని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో అందరూ ఒక్కటై కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులకు ఐదు లక్షల కోట్ల రుణమాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద డబ్బులేదుగానీ.. 30 లక్షల కోట్లు కార్పొరేట్ రంగానికి రుణమాఫీ చేశారని కోదండరాం ఆరోపించారు. నిరుద్యోగం దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని చెప్పారు. వ్యవసాయ బడ్జెట్ 30% తగ్గించిందన్నారు.
వ్యవసాయ సబ్సిడీలు 43% శాతానికి తగ్గించిందని ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయని చెప్పారు. జీఎస్టీ ప్రజల మీద భారం అయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీతో దాదాపు 38 వేల కోట్లు అదనపు ఆదాయం వసూలు చేసిందని దుయ్యబట్టారు. పెట్రోల్ డీజిల్ మీద విపరీతమైన పన్నులు వేసి రేట్లు పెంచారన్నారు. బీజేపీకి ఓటు వేస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని హెచ్చరించారు. అసమానతలను మరింత తీవ్రంగా పెంచడానికే బీజేపీ అధికారాన్ని కోరుకుంటుందని కోదండరాం ఆరోపించారు. అందుకే 400 సీట్లు అడుగుతున్నారన్నారు. అసమానతలు పెరగకుండా ఉండాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సిటిజన్ ఫోరం నాయకులు కొండల్ రెడ్డి, పీడీ ఆనందం, తదితరులు పాల్గొన్నారు.