మాజీ సీఎం జగన్‌పై రాజాసింగ్ ఫైర్
విధాత : ఏపీలో దేవాలయాలను దెబ్బతిసే చర్యలకు పాల్పడి, హిందూ ధర్మానికి నష్టం చేకూర్చే విధంగా వ్యవహారించినందునే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. గతంలో కన్వర్టెడ్ క్రిస్టియన్ జగన్ అధికారంలోకి రాగానే హిందూ ధర్మానికి తీవ్ర నష్టం చేశారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రాచీన దేవాలయాలను దెబ్బతీశారని, జగన్ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, మాంసం, మందు కూడా కొండపైకి తరలించారని ఫైర్ అయ్యారు.
తిరుమలలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం, కన్వర్ట్ క్రిస్టియన్‌ను టీటీడీ చైర్మన్‌గా చేయడం వంటి తప్పుడు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. జగన్ పాలనలో జరిగిన ఈ పరిణామాలన్నింటిని చూసిన ఏపీ ప్రజలు ఆయను ఓడించారన్నారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన మాట్లాడుతూ.. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే చంద్రబాబు తిరుమలలో అధర్మమైన పనులు చేస్తే సహించేది లేదని తేల్చిచెప్పారని, అదే పద్దతిలో శ్రీశైలంలో కూడా హిందూ ధర్మ వ్యతిరేకుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో ఉన్న ప్రాచీన దేవాలయాల్లో హిందూ ధర్మాన్నే ప్రచారం జరిగేలా చూడాలన్నారు. హిందువులకు మాత్రమే ఆలయాల్లో ఉద్యోగాలు, చైర్మన్, బోర్డు మెంబర్లు ఇవ్వాలని ఈ సందర్భంగా రాజాసింగ్ డిమాండ్ చేశారు.