రేషన్‌కార్డులు..పెన్షన్‌లలో అనర్హులను ఏరివేస్తాం … మంత్రి పొంగులేటి పునరుద్ఘాటన

ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో అనర్హులను తొలగిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఆదివారం ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన పొంగులేటి మాట్లాడుతూ రేషన్‌కార్డులు, పెన్షన్‌లలో అనర్హులను గుర్తించి తొలగిస్తామన్నారు

  • Publish Date - June 23, 2024 / 06:11 PM IST

విధాత : ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో అనర్హులను తొలగిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఆదివారం ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన పొంగులేటి మాట్లాడుతూ రేషన్‌కార్డులు, పెన్షన్‌లలో అనర్హులను గుర్తించి తొలగిస్తామన్నారు. రైతుబంధు అనర్హులకు అందకుండా చూస్తామన్నారు. గత బీఆరెస్ మాదిరిగా రుణమాఫీపై మాయమాటలతో కాలం గడుపకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం ఆగస్టు 15లోగా చెప్పినట్లుగానే ఒకేసారి 2లక్షల రుణమాఫీ చేస్తుందని స్పష్టం చేశారు. రైతుని రాజు చేయాలన్నదే మా ఆశయమని, నిబద్ధత గల ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం ప్రజలు కోరుకునే ప్రభుత్వం మా ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. గత బీఆరెస్‌ ప్రభుత్వం పేదలకు గజం స్థలం కూడా ఇవ్వలేదని మేం మాత్రం అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి కేసీఆర్ ప్రభుత్వం పోయిందని, ఆ ప్రాజెక్టు నేడు కుంగిపోయి కొట్టుకపోయిందన్నారు. ఒకపక్క ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు కట్టాల్సి వస్తుందని, మరోపక్క పేదోడి గౌరవాన్ని కాపాడుకోవాల్సి వస్తుందని, రెండిటిని సమతుల్యం చేస్తూ మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదవాడికి న్యాయం చేస్తూ ఇచ్చిన హామీల అమలుకు ముందుకెలుతుందన్నారు. పాలేరులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తామని, అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్‌లు అందిస్తానని స్పష్టం చేశారు.

 

Latest News