- అందుకే పులులతో పోల్చుకుంటున్నారు
- కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందన
- సమర్థులను సంప్రదించాకే జాబితా
- కాంగ్రెస్ నేతలకు అనేక అవకాశాలు
- పొత్తులు ఇంకా చర్చల దశలోనే
- మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు
విధాత, హైదరాబాద్: నరమాంసానికి అలవాటు పడ్డ కుటుంబం పులులతో పోల్చుకుంటున్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన బీఆరెస్ సభలో మంత్రి కేటీఆర్ తన తండ్రి సీఎం కేసీఆర్‌ను పులితో పోల్చడంపై రేవంత్రెడ్డి ఈ విధంగా స్పందించారు. తండ్రిని జంతువుతో కేటీఆర్ కరెక్టుగా పోల్చారని చురకలేశారు.
మంగళవారం గాంధీభవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. అనంతరం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీట్ల విషయంలో సమర్థులైన నాయకులను సంప్రదించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అప్పటి వరకూ మీడియా సంయమనం పాటించాలని కోరారు. అభ్యర్థులను ప్రకటించి బస్సు యాత్రకు వెళ్లాలా? లేక బస్సు యాత్ర మధ్యలో అభ్యర్థులను ప్రకటించాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఆశావహుల్లో కొందరికి టికెట్లు ఇవ్వడం లేదని పరోక్షంగా చెప్పిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ నేతలకు అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్సీ తదితర పదవులు చాలానే ఉన్నాయని, పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని అన్నారు. వారి వారి హోదాలు, గౌరవం తగ్గకుండా సమన్వయం చేసేందుకు కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కమిటీని నియమించారన్నారు.
ఎలాంటి సమస్యలున్నా కమిటీ సభ్యులైన ఠాక్రే, దీపాదాస్ మున్షి, మీనాక్షి నటరాజన్, జానారెడ్డి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు. పొత్తుల అంశం ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నదని రేవంత్రెడ్డి చెప్పారు. నిర్ణయాలు జరిగితే మీడియాకు వెల్లడిస్తామన్నారు. కొందరు అధికారులు బీఆరెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారన్నరేవంత్ రెడ్డి.. నిబంధనలు ఉల్లంఘించి నిధులు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. పెన్షన్ తప్ప మిగతా వాటికి ఎన్నికలయ్యేవరకు ఎలాంటి నిధులు విడుదల చేయొద్దన్నారు.
బీఆరెస్ పార్టీకి కొమ్ముకాసే అన్ని శాఖల్లోని అధికారుల వివరాలు కాంగ్రెస్ సేకరిస్తున్నదని చెప్పారు. వాటి ఆధారంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. చట్టంలో లొసుగులు వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీఆరెస్ ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసే మీడియా యజమాన్యాలపైనా ఫిర్యాదు చేస్తామన్నారు. తప్పుడు వార్తలు వేసి, కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆరు నెలల ముందటి టెండర్లపై కాంగ్రెస్ ప్రభుత్వ సమీక్ష
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన ఆరు నెలల ముందు వేసిన అన్ని టెండర్లు, భూముల అమ్మకాలపై అధికారంలోకి రాగానే సమీక్షలు నిర్వహిస్తామని రేవంత్రెడ్డి చెప్పారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగానే ప్రభుత్వం పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రకటనలకు అవకాశం ఇవ్వాలని హైదరాబాద్ మెట్రో వారికి సూచించారు. బస్సు యాత్రపై రెండు రకాల సూచనలు వచ్చాయని, జాతీయ నాయకత్వం సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.